రాజధాని సత్తా మాకే: చిరు, టిక్కెట్‌పై బాలకృష్ణ కౌంటర్
విజయవాడ/హిందూపురం: విజయవాడకు రాజధానిని తీసుకు వచ్చే సత్తా కాంగ్రెసు పార్టీకే ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఎపి కాంగ్రెసు ప్రచార కమిటీ చీఫ్ చిరంజీవి శనివారం అన్నారు. కొత్త రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాలన్నారు. టిడిపి బిజెపితో కలిసి చారిత్రక తప్పిదం చేసిందని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఇవే చివరి ఎన్నికలు అని చెప్పారు. అధికారం కోసం చంద్రబాబు అనైతిక పొత్తు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన అక్రమాస్తులను కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నారన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని జగన్ ఒక్క మాట కూడా అనడం లేదన్నారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు ఓటు వేస్తే మోడీకి ఓటు వేసినట్లే అన్నారు. సీమాంధ్ర అభివృద్ధి కాంగ్రెసు పార్టీతోనే సాధ్యమని చెప్పారు. చిరంజీవి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం చేశారు.
బాలకృష్ణ కౌంటర్
హీరో, టిడిపి నేత నంతమూరి బాలకృష్ణ సీమాంధ్ర ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి నిన్న చేసిన వ్యాఖ్యలపైన స్పందించారు. హిందూపురం టిక్కెట్ ముస్లింలకు ఇవ్వకుండా బాలకృష్ణకు ఇవ్వడమేమిటని చిరు ప్రశ్నించారు. దీనికి బాలయ్య సమాధానం చెప్పారు.
తమ పార్టీలో అన్ని వర్గాలకు టిక్కెట్లలో సమన్యాయం చేశామన్నారు. టిక్కెట్ల విషయంలో ఏ వర్గానికి అన్యాయం జరగలేదన్నారు. తాను ఎప్పుడు హిందూపురం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. తెలంగాణ, సీమాంధ్ర అభివృద్ధి టిడిపితోనేనని, అది ప్రజలకు తెలుసునని, రెండు ప్రాంతాల్లో తమ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందన్నారు.












Click it and Unblock the Notifications