
చిరంజీవి "మెగా" ఔదార్యం- అభిమానికి క్యాన్సర్ చికిత్స కోసం..!!
మెగాస్టార్ చిరంజీవి మరోసారి మానవత్వం చాటుకున్నారు. తన అభిమానులు కష్టాల్లో ఉంటే వెంటనే స్పందించే చిరంజీవి..ఇప్పుడు మరోసారి అదే విధంగా చేసారు. క్యాన్సర్ తో బాధ పడుతున్న అభిమానిని హైదరాబాద్ కు పిలిపించి అక్కడ వైద్య చికిత్స అందిస్తున్నారు. మెగాస్టార్ జన్మదిన వేడుకలకు అభిమానులు సిద్దమవుతున్న సమయంలో.. మెగాస్టార్ అభిమానికి అండగా నిలుస్తూ.. ఆరోగ్యం కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు మెగా ఫాన్స్ కు మరింత అభిమానం పెంచుతోంది.

క్యాన్సర్ లో అభిమాని ఆవేదన
క్రిష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన దొండపాటి చక్రధర్ చిరంజీవి అభిమాని. చాలా కాలంగా చిరంజీవి అభిమానిగా ఉంటున్న ఆయన అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కొంత కాలంగా చక్రధర్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. స్థానికంగా చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఆయన ఆరోగ్యం విషయం తెలుసుకున్న చిరంజీవి ఆరా తీసారు.
అక్కడ నుంచి హైదరాబాద్ కు రప్పించారు. ఓమేగా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చిరంజీవి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అభిమానికి నేనున్నానంటూ ధైర్యం కల్పించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. గతంలోనూ పలు సందర్భాల్లో అనేక మంది అభిమానులకు చిరంజీవి బాసటగా నిలిచారు.

హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్పించి
తాను అభిమానించే అభిమానులు లేకపోతే తాను ఈ స్థాయికి చేరేవాడిని కాదని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్..కరోనా సమయంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ద్వారా సేవా కార్యక్రమాలను చిరంజీవి నిర్వహించారు. కరోనా వేళ కోట్లాది రూపాయాల సొంత నిధులతో ఆయన ఎంతో మందికి ఆక్సిజన్ అందించేందుకు రెండు రాష్ట్రాల్లోనూ ముందుకొచ్చారు.
ఆ కార్యక్రమాన్ని రాం చరణ్ పర్యవేక్షించారు. ఇక, పలువురి అభిమానులు ఆరోగ్య సమస్యలు తెలుసుకున్న సమయంలో చిరంజీవి వెంటనే స్పందిస్తున్నారు. వారికి హైదరాబాద్ లోని ప్రముఖ కార్పోరేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు తాను చొరవ తీసుకుంటున్నారు.

మెగాస్టార్ పరామర్శ.. అండగా నిలుస్తానంటూ
తన ఇంటికి పిలిపించి వారికి బాసటగా నిలవటం.. ఆస్పత్రుల్లో అభిమానులను పరామర్శించటం.. ఆర్దికంగా తోడ్పాటు అందివ్వటం కొనసాగిస్తున్నారు. ఈ నెల 22న చిరంజీవి జన్మదినం. ప్రతీ ఏటా చిరంజీవి జన్మదినం నాడు అభిమానులు పెద్ద సంఖ్యలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సారి అదే స్థాయిలో నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ఇప్పుడు, ఈ అభిమాని క్యాన్సర్ చికిత్స కోసం చిరంజీవి వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ..హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స ఇప్పించటం.. పరామర్శించి ధైర్యం చెప్పటంతో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. మెగా ఔదార్యం ఇప్పుడు వైరల్ అవుతోంది.