కాంగ్రెస్ పార్టీలో 'చిరు' చర్చ: ఆ కారణంతో ప్రస్తుతానికి దూరమా?
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి విషయమై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ సాగుతోందని అంటున్నారు. చిరంజీవి గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు అంటీముట్టనట్లుగా ఉంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇటీవల విజయవాడలో జరిగిన ఏపీ కాంగ్రెస్ పార్టీ సదస్సుకు చిరంజీవి హాజరు కాలేదు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుకు హాజరయ్యారు. అయితే, అది కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల ఒత్తిడితో హాజరయ్యారంటున్నారు.

చిరంజీవి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండేందుకు కారణముందని అంటున్నారు. చిరు సినిమాల కోసం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, అలాగే లోకసభ ఎన్నికలకు మరో నాలుగేళ్లకు పైగానే ఉంది.
ఈ నేపథ్యంలో పూర్తిగా సినిమాల పైన దృష్టి సారించాలని చిరంజీవి భావిస్తున్నారని అంటున్నారు. అందువల్లే ఆయన పార్టీ వ్యవహారాలకు అంతగా హాజరు కావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పట్లో ఎన్నికలు లేనందున, 150వ చిత్రం పైన ప్రత్యేక దృష్టి పెట్టనున్నందున ప్రస్తుతానికి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటమే మంచిదని చిరు భావిస్తున్నారేమోనని కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతోందని సమాచారం.












Click it and Unblock the Notifications