చిరంజీవి 'జై జనసేన' వెనుక - ఢిల్లీ మెగా టాస్క్, కొత్త బాధ్యతలు..!!
ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తి కర పరిణామం. మెగాస్టార్ చిరంజీవి జై జనసేన నినాదం సంచలనం గా మారుతోంది. కొద్ది రోజులుగా బీజేపీ నేతలు చిరంజీవి కోసం చేస్తున్న ప్రయత్నాల వేళ ఇప్పుడు చిరంజీవి తన ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనగా రూపాంతరం చెందిందని చెప్పటంతో రాజకీయం గా కొత్త లెక్కలను తెర మీదకు తీసుకొస్తోంది. ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాల పై బీజేపీ నేతలు పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మెగా బ్రదర్స్ పైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యల వెనుక కీలక సమీకరణాలు - అంచనాలు తెర మీదకు వస్తున్నాయి.
చిరంజీవి వ్యాఖ్యలతో
రాష్ట్ర విభజన తరువాత చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అనేక సందర్భాల్లో చిరంజీవి రాజకీయ రీ ఎంట్రీ గురించి చర్చ జరిగినా తనకు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసారు. జనసేన ఆవిర్భావ సమయంలో మరో ప్రజారాజ్యం అంటూ ప్రచారం విమర్శలు టార్గెట్ చేసారు. నాటి ప్రజారాజ్యం లో చోటు చేసుకున్న పరిణామాలను పలు సందర్భాల్లో పవన్ ప్రత్యేకం గా ప్రస్తావన చేసారు. చిరంజీవి నాడు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటం పవన్ కు ఇష్టం లేదనే వాదన ఉంది. కాగా, పవన్ జనసేన పార్టీ ఏర్పాటు తరువాత ఆ వ్యవహారాల్లో ఎప్పడూ చిరంజీవి జోక్యం చేసుకోలేదు. కొన్ని సందర్భాల్లో మాత్రం పవన్ కు తన మద్దతు ఉంటుందని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

తమ్ముడు కోసం
పవన్ పిఠాపురం నుంచి పోటీ చేసే సమయంలోనూ తమ్ముడుకు మద్దతుగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్నికల్లో గెలిచి ఇంటికి వచ్చిన పవన్ కు మాత్రం గ్రాండ్ గా స్వాగతం పలికారు. ఇక, పవన్ ప్రమాణ స్వీకార వేదిక నుంచి మెగా బ్రదర్స్ తో కలిసి ప్రధాని మోదీ ఇద్దరి చేతులను పైకెత్తి అభివాదం చేయిస్తూ..తన మనసులో ఏముందో స్పష్టం చేసారు. ఆ తరువాత చిరంజీవి తమతో కలిసి వచ్చేలా బీజేపీ నేతలు పలు ప్రయత్నాలు కొనసాగించారు. కానీ, చిరంజీవి ఎక్కడా తన మనసులో మాట బయట పెట్టలేదు. పవన్ సైతం తన అన్నయ్య రాజకీయ భవిష్యత్ గురించి ఎప్పడూ స్పందించ లేదు. ఇప్పుడు చిరంజీవి నాటి ప్రజారాజ్యమే నేటి జనసేన అని చెప్పటంతో భారీ వ్యూహం కనిపిస్తోంది.
మెగా వ్యూహం
ఇక, నాడు ప్రజారాజ్యంలో చిరంజీవితో కలిసి పని చేసిన వారు ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. మరి కొందరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వారిని తిరిగి జనసేనకు దగ్గర చేసేలా తాజాగా చిరంజీవి ఈ స్పష్టత ఇచ్చినట్లు విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రస్తుతం కూటమిలో భాగస్వామిగా ఉన్నా పవన్ తన పార్టీ బలోపేతం కోసం కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. అటు ప్రధాని మోదీ సైతం పవన్ తో పాటుగా చిరంజీవికి ప్రత్యక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీలో జనసేన భవిష్యత్ కోసం చిరంజీవి తన వంతు పాత్ర పోషించేందుకు సిద్దమైనట్లు స్పష్టం అవుతోంది.
ఇక సిద్దమేనా
బీజేపీ ఢిల్లీ నేతలు చిరంజీవి - పవన్ తో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో చిరంజీవి అంగీకరిస్తే కొత్త బాధ్యతలు ఇచ్చేందుకు కీలక ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. దీంతో, ఇప్పుడు చిరంజీవి జనసేనకు జై కొట్టారు. దీంతో, చిరంజీవి తాజా వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications