పుట్టిన రోజు: చిరంజీవి ఇటు, పవన్ కళ్యాణ్ అటు!
హైదరాబాద్: మెగా సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను త్వరలో ఒకరి పాత్రలో మరొకరిని చూస్తామా!? అంటే అవుననే అంటున్నారు. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెసు పార్టీ చతికిల పడటంతో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఇక తన 150వ చిత్రం పైన దృష్టి పెట్టనున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ త్వరత్వరగా తన సినిమాలను పూర్తి చేసుకొని పార్టీ నిర్మాణం పైన దృష్టి సారించనున్నారు.
చిరంజీవి, ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి తదితరులకు ఏఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీ నుండి పిలుపు వచ్చింది. వారు జూన్ 2న సోనియాను కలుస్తారు. సీమాంధ్రలో ఓటమి పైన వారు అధినేత్రికి నివేదిక ఇవ్వనున్నారు. ఆ తర్వాత చిరంజీవికి దాదాపు ఎక్కువ శాతం విశ్రాంతి దొరకనుంది.

విభజన నేపథ్యంలో చిరంజీవి సీమాంధ్రలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయనున్నారు. అందులో భాగంగానే ఆయన 150వ చిత్రంలో నటించనున్నారు. సమీప భవిష్యత్తులో సీమాంధ్రలో ఎలాంటి ఎన్నికలు లేనందున చిరంజీవి తన చిత్రం పైన దృష్టి సారించనున్నారు. ఇప్పటికే దీనిపై చర్చలు జరుగుతున్నాయి.
150వ చిత్రం కోసం చిరంజీవి కసరత్తు చేస్తున్నారట. ఈ చిత్రం మంచి సందేశంతో కూడుకున్నదయి ఉండాలని భావిస్తున్నారు. వివి వినాయిక్ ఆధ్వర్యంలో పరుచూరి బ్రదర్శ్, చిన్ని కృష్ణ కలిసి ఈ స్క్రిప్టుని సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చిరు తనయుడు రామ్ చరణ్ తేజ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశముంది. అన్ని కుదిరితే చిరు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న 150వ సినిమా పైన ప్రకటన చేయాలని భావిస్తున్నారు.
మరోవైపు.. పవన్ కళ్యాణ్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల వరకు ఆయన టిడిపి, బిజెపి కూటమి తరఫున జోరుగా ప్రచారం నిర్వహించారు. దీంతో ఆయన సినిమాలకు తాత్కాలికంగా విరామం వచ్చింది. దీంతో ఇప్పుడు ఆయన పూర్తిగా సినిమాల పైన దృష్టి సారిస్తున్నారు.
అయితే, ఈ ఏడాది చివర్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో టిడిపి, బిజెపి, జనసేన కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఇందుకోసం తన సినిమాలను త్వరగా పూర్తి చేసి.. నగరంలో అలాగే రాష్ట్రంలో పార్టీ నిర్మాణం పైన పవన్ దృష్టి సారించనున్నారు.












Click it and Unblock the Notifications