డిగ్గీతో చిరు: ఎన్నికల వాయిదాపై సీమాంధ్రVsటి కాంగ్రెస్
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను మంగళవారం కలిశారు. రాష్ట్ర పరిణామాలపై వారు చర్చించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేసులో చిరు ఉండటంతో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధానమంత్రితో కెసిఆర్
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు భేటీ అయ్యారు.

డిగ్గీతో తెలంగాణ నేతలు
దిగ్విజయ్ సింగ్‌తో తెలంగాణ ప్రాంత నేతలు సునిత రెడ్డి, డికె అరుణ, వెంకట్ రెడ్డిలు భేటీ అయ్యారు. భేటీ అనంతరం డికె అరుణ మాట్లాడుతూ.... షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరపాలని కోరినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ వంద స్థానాల్లో గెలుపొందడం ఖాయమన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం కోసం షరతులు పెట్టడం సరికాదని, వారు కోరిన తెలంగాణనే కేంద్రం ఇచ్చిందన్నారు. కాంగ్రెసు పార్టీలో తెరాస విలీనం అవుతుంది తప్ప తమ పార్టీ తెరాసలో విలీనం కావట్లేదని మండిపడ్డారు. కెసిఆర్ విలీనంపై మాట నిలబెట్టుకోవాలని, విలీనం కోసం బేరాల రాజకీయాలు చేయవద్దన్నారు.
బొత్సతో టిఎస్సార్, కొండ్రు భేటీ
పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణతో రాజ్యసభ సభ్యులు టి సుబ్పిరామి రెడ్డి, కొండ్రు మురళీలు భేటీ అయ్యారు. అనంతరం టిఎస్సార్, కొండ్రులు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గల ఎమ్మెల్యేల బలం ఉందన్నారు.
అలాగే ఎన్నికలను ఆరు నెలల పాటు పొడిగించాలని కోరినట్లు చెప్పారు. ఎన్నికలు పొడిగిస్తే సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ బలోపేతమయ్యే అవకాశముందన్నారు. కాగా, తెలంగాణ ప్రాంత నేతలు త్వరగా ఎన్నికలు జరిపించాలని కోరుతుండగా, సీమాంధ్ర నేతలు మాత్రం అప్పుడే ఎన్నికలు వద్దని, వాయిదా వేయాలని కోరుతుండటం విశేషం.












Click it and Unblock the Notifications