అవిశ్వాసం: ఎంపీలపై చిరు అసహనం, ఇదీ లాజిక్...!
న్యూఢిల్లీ: యూపిఏ ప్రభుత్వంపై సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సోమవారం అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత ప్రభుత్వంపై అవిస్వాస తీర్మానం పెట్టాలని పార్టీ ఎంపీలు తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సరైంది కాదన్నారు.
అధిష్టానంపై ఒత్తిడి తేవడానికి ఇతరత్రా మార్గాలు, పద్ధతులను అనుసరించవచ్చునని, ప్రతిపక్ష పార్టీలకు మేలు చేసేలా చర్యలు ఉండరాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమేనన్నారు.

మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజీనామాను కోరటం సరికాదన్నారు. ఆమె పుట్టిన రోజు నాడు (డిసెంబర్ 9) న సీమాంధ్రలో విద్రోహ దినం పాటించడాన్ని అభ్యంతరకరమని చిరంజీవి అన్నారు.
తప్పిదం: సీతారాం ఏచూరి
యూపిఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్న పదమూడు మంది సీమాంధ్ర ఎంపీల నిర్ణయం వ్యూహాత్మకంగా సరికాదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ఎంపీల అవిశ్వాస తీర్మానంపై మీ వైఖరి ఏమిటని పిటిఐ ప్రతినిధి అడిగినప్పుడు ఏచూరి స్పందించారు.
"అది సరైన వ్యూహం కాదు. ప్రభుత్వం మాటున పార్టీలను సమీకరించడం, దానికి మద్దతు కూడగట్టడంలో అర్థం లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు దానిని వ్యతిరేకించడానికి పార్టీల మద్దతు కూడగట్టడమే సరైన వ్యూహం అనిపించుకుంటుంది'' అని చెప్పారు. ఒకవైపు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయని, అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వం పడిపోయినా ఎన్నికలు ముగిసే వరకు ఈ ప్రభుత్వాన్నే కొనసాగాలని కోరే అవకాశం ఉందన్నారు. అలాంటప్పుడు అవిశ్వాసం పెట్టినా ఫలితం ఉండదని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications