UK Visa Lottery 2026: జాబ్ లేకపోయినా యూకే వీసా..! ఇలా దరఖాస్తు చేసుకోండి..!
బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయులకు గుడ్ న్యూస్. భారత్-బ్రిటన్ మధ్య ఉన్న ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద యూకేలో నివసించడానికి, పని చేయడానికి మన పౌరులకు మంచి అవకాశం లభిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో ఈ పథకం కింద నిర్వహించే యూకే వీసా లాటరీ (UK Visa lottery 2026) ఓపెన్ కాబోతోంది. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి 48 గంటలు మాత్రమే సమయం ఉంటుంది. కాబట్టి ఈ పథకం కింద అర్హులైన భారతీయులు ఉద్యోగం లేకపోయినా యూకే వెళ్లేందుకు ఛాన్స్ దొరుకుతోంది.
ప్రతీ ఏటా భారత్ నుంచి యూకేకు వచ్చే వారి కోసం వీసా లాటరీ బ్యాలెట్ ను ఓపెన్ చేస్తారు. ఈ ఏడాది ఈ బ్యాలెట్ జూలై 21 న ఓపెన్ కానుంది. అక్కడి నుంచి 48 గంటల పాటు ఓపెన్ గా ఉంటుంది. ఈ లాటరీలో ఎంపికైన భారతీయ దరఖాస్తుదారులు తర్వాత యజమాని స్పాన్సర్‌షిప్ అవసరం లేకుండా రెండేళ్ల పాటు బ్రిటన్ లో నివసించడానికి,పని చేయడానికి, చదువుకోవడానికి అనుమతించే వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన అర్హతలు, పత్రాలు, ఇతర వివరాలు ఓసారి చూద్దాం.

ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ పథకం యూకే వెళ్లేందుకు ఓ వీసా మార్గం. ఇది అనేక ఇతర వర్క్ వీసాల తరహాలో ఉండదు. ఈ పథకానికి దరఖాస్తుదారులు ప్రయాణానికి ముందు ఉద్యోగ ఆఫర్ లేదా యజమాని స్పాన్సర్‌షిప్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు మొదట బ్యాలెట్‌లో పాల్గొనాలి. బ్యాలెట్‌లో ఎంపికైన వారికి వారి వీసా దరఖాస్తును సమర్పించడానికి ఆహ్వానం అందుతుంది. ఈ బ్యాలెట్ జూలై 21న భారతీయ సమయం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఓపెన్ అవుతుంది. తిరిగి జూలై 23 మధ్యాహ్నం 1:30 గంటలకు క్లోజ్ చేస్తారు. బ్యాలెట్‌లో పాల్గొనేందుకు ఎలాంటి రుసుము చెల్లించక్కర్లేదు.
ఈ పథకానికి అర్హత పొందాలంటే, దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారత పౌరులై ఉండాలి, 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉండాలి, యూకేలో తమ జీవనం సాగించడానికి కనీసం రూ.3,27,151 బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. వీసా కోసం దరఖాస్తు చేసుకునే ముందు దరఖాస్తుదారులు తప్పనిసరిగా బ్యాలెట్‌లో ఎంపిక కావాలి.

ఈ అర్హతలు కలిగిన వారు యూకే ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి పేరు, పుట్టిన తేదీ, పాస్‌పోర్ట్ యొక్క స్కాన్ కాపీ, పాస్‌పోర్ట్ వివరాలు, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ భర్తీ చేయాలి. పాస్ పోర్ట్ వివరాలతో మిగతా వివరాలు సరిపోలాలి. బ్యాలెట్ లో ఎంపికైతే వీసా కోసం దరఖాస్తు చేసుకోమని ఆహ్వానిస్తూ ఓ ఈ-మెయిల్ వస్తుంది. అప్పటి నుంచి 90 రోజుల్లోపు ఆన్‌లైన్ వీసా దరఖాస్తు సమర్పించాలి, వీసా దరఖాస్తు రుసుము (43,964), ఇమ్మిగ్రేషన్ ఆరోగ్య సర్‌ఛార్జ్ (2,00,687)చెల్లించాలి, బయోమెట్రిక్ సమాచారం ఇవ్వాలి. అవసరమైన ఇతర పత్రాలను సమర్పించాలి. బ్యాలెట్‌లో ఎంపికైనంత మాత్రాన వీసా మంజూరైనట్లు కాదు. వీసా దరఖాస్తు ప్రక్రియ సమయంలో అన్ని అర్హతలు కలిగి ఉంటే అప్పుడే వీసా మంజూరవుతుంది.
















Click it and Unblock the Notifications