విభజన కొలిక్కి రాలేదు, కిరణ్ తీరు సమర్థనీయం: చిరు
న్యూఢిల్లీ: విభజన అంశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తాను మద్దతిస్తున్నానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి శనివారం చెప్పారు. విభజన విషయంలో కేంద్రం తీరు సరికాదని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ఆఖరి వరకు సమైక్యాంధ్ర కోసం పోరాడుతామని, అధికాశాతం ప్రజల అభిమతానికి అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు.
విభజనపై సిఎం వైఖరిని సమర్థిస్తున్నట్లు చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన విభజించాలన్న కేంద్రం తీరు సరికాదన్నారు. విభజనకు తాను వ్యతిరేకినని, ఇది ఇంకా ఓ కొలిక్కి రాలేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు.

సమైక్యం మినహా మరే డిమాండ్ లేదని, అది వీలుకాదన్నప్పుడు భవిష్యత్తు ప్రణాళికపై ఆలోచిస్తామన్నారు. సీమాంధ్రకు న్యాయం చేసే ప్రణాళిక అవసరమని, తాత్సారం చేస్తే అదీ చేజారుతుందని ఆందోళన చెందుతున్నారన్నారు.
విభజన అనివార్యమని కొందరు అంటున్నారని, అలాంటప్పుడు సీమాంధ్రకు న్యాయం ఉండాలనే ప్రణాళిక ఉండాలని కొందరు చెబుతున్నారన్నారు. అయినా ఇంకా ఏ విషయం కొలిక్కి రాలేదన్నారు.
కాగా, కాపులకు ఓబిసి హోదా కల్పించాలన్న డిమాండ్ సహేతుకమైనదని చిరు అన్నారు. తాను సాధ్యమైనంత త్వరగా ఈ విషయాన్ని కేంద్రమంత్రివర్గం, అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. ఓబిసి జాబితాలో కొత్త కులాలను చేర్చినందువల్ల పాత వారికి అన్యాయం జరగకుండా చూడాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications