తెలంగాణ కాంగ్రెస్ కు అందివచ్చిన అస్త్రం- ప్రధాని మోదీకి ఎంపీ లేఖ
దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలను తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలచుకుంటోంది. సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం మొదలుకుని పలు అంశాలపై భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టడానికి వ్యూహాలు పన్నుతోంది. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులపై లాఠీ ఛార్జీ చేయడాన్ని తప్పుపడుతోన్న తెలంగాణ కాంగ్రెస్.. దీన్ని మరింత ఉధృతం చేసింది.
ఇప్పటికే నీట్ పేపర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిరసన గళం విప్పారు. హైదరాబాద్ లో భారీ ఎత్తున మశాల్ మార్చ్ నిర్వహించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అయోధ్య రామాలయానికి సమర్పించిన కానుకల చోరీ వ్యవహారాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తోంది.

ఇందులో భాగంగా.. కాంగ్రెస్ పెద్దపల్లి లోక్‌సభ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నీట్ పేపర్ల వ్యవహారం, అయోధ్య రామమందిరం చోరీ అంశాలపై తక్షణమే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల పనితీరుపై ప్రజల్లో నమ్మకం సడలిపోకుండా ఉండేందుకు తక్షణ చర్యలు అవసరమని స్పష్టం చేశారు.
కేంద్రం ఆధీనంలో పని చేసే ఎన్టీఏ వైఫల్యం చెందడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని, ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి తప్పిదాలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వంశీకృష్ణ ఈ లేఖలో పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించకుండా, విచారణ జరిపి నిజాలను ప్రజల ముందు ఉంచాలని చెప్పారు.
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాల వ్యవహారాన్ని కూడా వంశీకృష్ణ ఈ లేఖలో ప్రస్తావించారు. విరాళాల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, భగవంతునిపై భక్తులు ఉంచిన విశ్వాసం చాలా పవిత్రమైనదని, ఈ వివాదాన్ని త్వరితగతిన పరిష్కరించేందుకు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
ట్రస్ట్ నిర్వహణలో లోపాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయితే, అందుకు సంబంధించిన కేంద్ర మంత్రులు లేదా ఇతర ప్రజా ప్రతినిధులు సైతం తమ పదవుల నుంచి తప్పుకోవాలని వంశీకృష్ణ డిమాండ్ చేశారు. అధికారంలో ఎవరున్నా చట్టానికి అతీతులు కారని, ప్రజలకు పూర్తి స్థాయి జవాబుదారీతనంతో పాలిస్తామని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని, నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications