అమెరికన్ వీసా విద్యార్ధులకు బిగ్ అలర్ట్..! సెప్టెంబర్ 15లోగా తిరిగి రాకపోతే..!
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులకు, వారి కుటుంబాలకు ఇది అత్యంత కీలకమైన సమయం. ప్రస్తుతం సెలవులపై భారత్‌లో లేదా ఇతర దేశాలలో నివసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులందరూ ఈ ఏడాది సెప్టెంబర్ 15 లోపు తిరిగి అమెరికా చేరుకోవాలని ఇమ్మిగ్రేషన్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) తమ ఎఫ్-1 (F-1) స్టూడెంట్ వీసా నిబంధనలలో తీసుకువస్తున్న మార్పులే.
ఇప్పటివరకు అమెరికాలో సుదీర్ఘ కాలంగా అమలులో ఉన్న పాత 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్' (D/S) విధానాన్ని రద్దు చేసి, కొత్త నిబంధనలను సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి తెస్తున్నారు. పాత పద్ధతి ప్రకారం విద్యార్థులు తమ చదువు పూర్తయ్యేంత కాలం ఎలాంటి అదనపు అనుమతులు లేకుండా నిరభ్యంతరంగా అమెరికాలో చదువుకోవడానికి వీలుండేది. అయితే ఈ కొత్త విధానం ద్వారా ఇకపై విద్యార్థుల బసకు కేవలం నాలుగేళ్ల నిర్ణీత కాల వ్యవధిని మాత్రమే కేటాయిస్తారు. ఒకవేళ గడువు ముగిస్తే వీసా పొడిగింపు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

సెప్టెంబర్ 15 లోపు అమెరికా చేరుకున్న విద్యార్థులు మాత్రమే పాత డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ప్రయోజనాలను కోల్పోకుండా ఉంటారు. వీరు తమ ఐ-20 (I-20) ఫామ్‌లో పేర్కొన్న కోర్సు ముగింపు కాలపరిమితి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పాత నిబంధనల కింద కొనసాగవచ్చు. అయితే ఈ రక్షణ ప్రయోజనం కూడా గరిష్టంగా నాలుగేళ్లకు, అంటే 2030 నవంబర్ 14 వరకు మాత్రమే వర్తిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 15 తర్వాత విద్యార్థులు అమెరికా దాటి ఇతర దేశాలకు ప్రయాణించి తిరిగి వస్తే పాత ప్రయోజనాలు పూర్తిగా కోల్పోతారు. వారికి సరిహద్దు అధికారుల ద్వారా ఐ-94 (I-94) ఫామ్‌పై నిర్ణీత గడువును మాత్రమే ముద్రిస్తారు. అంతేకాకుండా కోర్సు ముగిసిన తర్వాత అమెరికా నుంచి నిష్క్రమించడానికి ఇచ్చే గ్రేస్ పీరియడ్ కూడా 60 రోజుల నుండి 30 రోజులకు తగ్గిపోతుంది. దీంతో విద్యార్ధులు గడువు ముగియగానే స్వదేశానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.












Click it and Unblock the Notifications