ఒప్పుకోకుంటే: చిరు అల్టిమేటం, కిరణ్‌కు బాలరాజు షాక్
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెసు పార్టీ అధిష్టానం నెరవేర్చకుంటే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి దేనికైనా సిద్ధంగా ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు. తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని చెబుతున్న చిరు.. విభజన జరిగితే మాత్రం హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని, రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇందుకోసం ఇతర కేంద్రమంత్రులతో పాటు చిరంజీవి కూడా పార్లమెంటులో వెల్‌లోకి వెళ్లి తన నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే లోకసభలో బిల్లు ప్రవేశ పెట్టినందున రేపటి నుండి జరిగే చర్చపై ఉత్కంఠ కొనసాగుతోంది. బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే ప్రయోగించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బిల్లుపై చర్చ సమయంలో ఇలాంటి ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తమ డిమాండ్లు పట్టించుకోకుంటే మాత్రం తాము దేనికైనా సై అంటున్నారు పలువురు సీమాంధ్ర కేంద్రమంత్రులు.
డిమాండ్లు ఒఫ్పుకోకుంటే ప్రజల అభీష్టానికి అనుగుణంగా వ్యవహరిస్తామని చిరంజీవి అంటున్నారు. బిల్లు విషయంలో పలు సవరణలు కూడా చేయాలని నిర్ణయించుకున్నారట. తమ డిమాండ్లకు ఓకే చెబితే తాము సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని లేదంటే తీవ్ర ప్రతిఘటన తప్పదని చెబుతున్నారు.
జగన్ పైన టిజి వెంకటేష్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి టిజి వెంకటేష్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన జరిగితే తనకు ఎక్కువ సీట్లు వస్తాయని, మీకు మద్దతిస్తానని జాతీయ పార్టీలతో ఓ నేత చెబుతున్నారట అని, అంతకంటే దారుణముండదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తానంటే అందరు వారిస్తున్నారని, ఆయన ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉందన్నారు.
ముఖ్యమంత్రికి బాలరాజు ఝలక్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రి బాలరాజ్ షాకిచ్చారు. కిరణ్ ముఖ్యమంత్రిగా సమావేశానికి పిలిస్తే తాను వెళ్లేవాడినని, పార్టీకి వ్యతిరేకంగా రాజీనామా చేస్తానంటే ఎలా వెళ్తామని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications