వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్లపైకి రండి: రాహుల్‌కు వీహెచ్ సూచన, బంగ్లా ఖాళీ చేసిన చిరంజీవి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ప్రజలతో కలిసి ఆందోళన చేయాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి సూచించారు. మంగళవారం పార్టీ అధినేత్రి సోనియా, లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే తదితరులు పాల్గొన్న కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (సిపిపి) సమావేశంలో ఆయన ఈ సూచన చేశారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ పార్లమెంట్‌లో ఎంత ఆందోళన చేసినా ఎలాంటి స్పందన ఉండడం లేదన్నారు. మోడీ ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీ ఉండడమే ఇందుకు కారణమన్నారు. సిపిపి సమావేశంలో పాల్గొన్న సీనియర్‌ నేతలు దిగ్విజయ్‌ సింగ్‌, అహ్మద్‌ పటేల్‌ కూడా వీహెచ్‌తో ఏకీభవించారు.

మంగళవారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినం కావటంతో ఎంపీలు హనుమంతరావు, గుత్తా సుఖేందర్‌ రెడ్డి, నంది ఎల్లయ్య, సుబ్బిరామిరెడ్డి, మాజీ ఎంపీలు పనబాక లక్ష్మి, మధుయాష్కీగౌడ్‌ తదితరులు సీపీపీ కార్యాలయంలో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Chiranjeevi vacated his official house

బంగ్లా ఖాళీ చేసిన చిరంజీవి: సామగ్రి హైదరాబాద్‌కు తరలింపు

కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి స్థానిక అక్బర్‌ రోడ్‌లోని 17వ నెంబర్‌ బంగ్లాను ఖాళీ చేశారు. యూపీఏ2 హయాంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు చిరంజీవి ఈ బంగ్లాను ఎంచుకున్నారు. దాదాపు పదెకరాల విస్తీర్ణంలో, 5కు పైగా సిబ్బంది క్వార్టర్లు గల సువిశాలమైన ఈ బంగ్లాలో చిరంజీవి తన స్వంత ఖర్చులతో కొన్ని మరమ్మతులు కూడా చేయించుకున్నారు. అయితే, బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో దీనిని హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు కేటాయించారు.

ఈ బంగ్లాను చిరంజీవికి రద్దు చేసి రాజ్‌నాథ్‌కు కేటాయిస్తున్నట్లు జూన్‌ 27వ తేదీన లోక్‌సభ హౌస్‌ కమిటీ ఛైర్మన్‌ కిరీట్‌ సోమయ ఆదేశాలు జారీ చేశారు. అయితే, రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా గతంలో పనిచేసి ప్రస్తుతం లోక్‌సభ సభ్యులుగా ఉన్న వారికి బంగ్లాల కేటాయింపులో రాయితీ ఉంటుంది. గతంలో వారు నిర్వర్తించిన పదవులను పరిగణలోకి తీసుకుని టైప్‌ 8, టైప్‌ 7 బంగ్లాలను కూడా లోక్‌సభ హౌస్‌ కమిటీ కేటాయిస్తుంది. అయితే, ఇప్పటి వరకూ రాజ్యసభ సభ్యులకు మాత్రం ఈ అవకాశం లేదు.

దీంతో రాజ్యసభ సభ్యులకు కూడా టైప్‌ 8, టైప్‌ 7 బంగ్లాల కేటాయింపులో రాయితీ ఇవ్వాలంటూ చిరంజీవితో పాటు మాజీ కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, వయలార్‌ రవి, జైరామ్‌ రమేశ్‌ తదితరులు రాజ్యసభ హౌస్‌ కమిటీ చైర్మన్‌ భుబనేశ్వర్‌ కళిత (కాంగ్రెస్‌)కు జూలై నెలలో విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని అక్టోబర్‌లో కమిటీ తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో, 17, అక్బర్‌రోడ్‌లోని బంగ్లాను ఖాళీ చేయాలంటూ చిరంజీవికి ఎస్టేట్‌ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. అయినా ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటంతో అక్టోబర్‌ 30వ తేదీన చివరి నోటీసును బంగ్లా గేటుకు అంటించారు.

చివరికి రెండు వారాల్లో బంగ్లా ఖాళీ చేస్తానని చిరంజీవి వారికి తెలిపారు. అన్నట్లుగానే ఆయన బంగ్లాను ఖాళీ చేసి, సామానును రెండు ట్రక్కుల్లో హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. కారును మాత్రం సహచర ఎంపీ సుబ్బిరామిరెడ్డి నివాసంలో ఉంచారు. కాగా, చిరంజీవికి తుగ్లక్‌ రోడ్డులో బంగ్లాను కేటాయించినట్లు రాజ్యసభ వర్గాలు తెలిపాయి.

English summary
Former Union Minister Chiranjeevi vacated his official house in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X