హైదరాబాద్ రికార్డును బద్దలు కొట్టిన చిత్తూరు
ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలకు మంచి శుభవార్త. 435 కిలోమీటర్ల పొడవైన చెన్నై-బెంగళూరు-మైసూర్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్‌లో చిత్తూరు భాగం కాబోతోంది. ఆటోమొబైల్ తయారీ హబ్ అయిన చెన్నైని ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరు, కర్ణాటక కల్చరల్ క్యాపిటల్ మైసూరుతో కలుపుతూ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా హైస్పీడ్ రైల్ అందుబాటులోకి రాబోతున్న నగరంగా చిత్తూరు రికార్డు సృష్టించబోతోంది.
చెన్నై-మైసూర్ మధ్య 435 కిలోమీటర్ల దూరం ఉంది. హైస్పీడ్ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే రన్నింగ్ లో ఉండే స్పీడ్ 320 కిలోమీటర్లుగా ఉంటుంది. హైస్పీడ్ రైలుద్వారా చిత్తూరు నుంచి చెన్నైకి అరగంటలో చేరుకోవచ్చు. అలాగే చిత్తూరు నుంచి 40 నిముషాల్లో బెంగళూరు చేరుకోవచ్చు.

చెన్నై-బెంగళూరు-మైసూర్ హైస్పీడ్ రైల్ కారిడార్ దక్షిణ భారతదేశంలో తొలి హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్ కాబోతోంది. రెండో ప్రాజెక్టుగా హైదరాబాద్-బెంగళూరు ప్రాజెక్ట్ నిలవనుంది. అయితే దీనికి సంబంధించిన పనులు మాత్రం ఇంకా మొదలవలేదు.
పరిశ్రమలు, టెక్ పార్క్‌లు, మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు, టౌన్‌షిప్‌లు ఎక్కువగా ఈ కారిడార్ లో ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ తమిళనాడులోని చెన్నైతోపాటు పూనమల్లి, అరక్కోణం, ఏపీలోని చిత్తూరు, కర్ణాటకలోని బంగారపేట, బెంగళూరు, చెన్నపట్న, మాండ్య, మైసూర్ నగరాలను కలపనుంది.
అలైన్ మెంట్ డ్రాయింగ్, సర్వే, ఇతర అవసరాల కోసం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఇప్పటికే కాంట్రాక్టులిచ్చింది. ఈ కారిడార్ వెంట ప్రస్తుతం సర్వే జరుగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్నవారితో కార్పొరేషన్ అధికారులు భేటీ అయ్యారు. వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications