శేషాచలం ఎన్‌కౌంటర్: తాజాగా పోస్టుమార్టం
చెన్నై/ తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా శేషాచలం ఎదురుకాల్పుల్లో మరణించిన ఐదుగురి మృతదేహాలకు తాజాగా మళ్లీ పోస్టుమార్టం నిర్వహించడానికి హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యులు చెన్నై చేరుకున్నారు.
శేషాచలం ఎన్‌రకౌంటర్‌లో 20 మంది మరణించిన విషయం తెలిసిందే. వారిలో ఐదుగురి మృతదేహాలకు తిరిగి పోస్టుమార్టం నిర్వహించాలని హైదరాబాద్ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. పోస్టుమార్టం కోసం హైదరాబాదులోని ఉస్మానియా లేదా గాంధీ ఆస్పత్రి వైద్యులను చెన్నై పంపించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది

ఎం తాఖుద్దీన్ ఖాన్, అభిజిత్ సుబేదారు, కెవి రమణ మూర్తి చెన్నైకి చేరుకున్నట్లు సమాచారం. మృతదేహాలను చెన్నైకి 190 కిలోమీటర్ల దూరంలో గల తివన్నామలై ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. దాంతో వారు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది.
పది రోజుల్లో నివేదిక...
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై పది రోజుల్లో ఎస్టీ కమిషన్‌కు నివేదిక ఇస్తానని జాతీయ ఎస్టీ కమిషన్ ఉపాధ్యక్షుడు రవి ఠాకూర్ తెలిపారు. శనివారం ఉదయం ఎన్‌కౌంటర్‌పై తిరుపతిలో అధికారులతో ఠాకూర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఎన్‌కౌంటర్‌పై విచారణలో ప్రభుత్వం సరైనరీతిలోనే వ్యవహరిస్తుందని భావిస్తున్నానన్నారు. ఎన్‌కౌంటర్ మృతులకు తమిళనాడు ప్రభుత్వం 4 హెక్టార్ల భూమి, ఉద్యోగం ఇవ్వాలని ఆయన చెప్పారు. ఇరుప్రాంతాల్లోనూ ఎర్రచందనం కూలీలు ఉన్నారని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఉపాధి కల్పించాలని ఠాకూర్ సూచించారు.












Click it and Unblock the Notifications