చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి - కుప్పంలో బరి గీసి : పుంగనూరు సీన్ మారేనా - బస్తీమే సవాల్..!!
ఏపీ రాజకీయాల్లో 2024 ఎన్నికల సవాళ్లు అప్పుడే మొదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ కొద్ది రోజుల క్రితం కేబినెట్ సమావేశంలో ముందస్తుగానే ఎన్నికలకు సిద్దం కావాలని మంత్రులకు సూచించారు. ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ టీం వస్తుందని వెల్లడించారు. 2019 ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితమైన టీడీపీ మరింత ఎదగకుండా చూడాలనేది వైసీపీ ప్లాన్. అందునా ముఖ్యమంత్రి జగన్ అసలు టార్గెట్ చంద్రబాబు. ఆయన్ను ఆత్మరక్షణలో పడేసే రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్నారు.

చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి
అందులో భాగంగా.. 2019 ఎన్నికల నుంచే కుప్పం పైన వైసీపీ ఫోకస్ పెట్టింది. ఆ ఎన్నికల కౌంటింగ్ సమయంలో తొలి రౌండ్ లో చంద్రబాబు వెనుకబడ్డారు. చిత్తూరు జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా చంద్రబాబు టీడీపీ నుంచి గెలిచారు. ఇక, కుప్పం నియోజకవర్గంలో జరిగిన పంచాయితీ..మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఇది చంద్రబాబుకు షాక్ గా మారింది. దీంతో..ఈ నెల 15న కుప్పం మున్సిపాల్టీ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదలకు ముందు రెండు రోజుల పాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించారు.

స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుపు
ఆ సమయంలోనే చంద్రబాబు మంత్రి పెద్దిరెడ్డి పైన కీలక వ్యాఖ్యలు చేసారు. కుప్పంలో ప్రతీ ఎన్నికల బాధ్యత ముఖ్యమంత్రి జగన్ మంత్రి పెద్దిరెడ్డికి అప్పగిస్తున్నారు. పెద్దిరెడ్డి గెలిచి చూపిస్తున్నారు. దీంతో.. ఇప్పుడు చంద్రబాబు ఏకంగా పెద్దిరెడ్డి నియోజకవర్గం పైన ఫోకస్ పెట్టారు. పెద్దిరెడ్డి పీలేరులో మూడు సార్లు...పుంగనూరులో మూడు సార్లు గెలుపొందారు. ఆయన వైఎస్.. రోశయ్య హాయంలో మంత్రిగా పని చేసారు. కిరణ్ సీఎం అయిన తరువాత ఆయనకు అవకాశం ఇవ్వలేదు. కిరణ్ కుమార్ రెడ్డి...పెద్దిరెడ్డి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు ఉంది.

చంద్రబాబు టార్గెట్ పుంగనూరు
ఇక, జగన్ సీఎం అయిన తరువాత కేబినెట్ లో పెద్దిరెడ్డి కీలకంగా మారారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా....పెద్దిరెడ్డికే బాధ్యతలు అప్పగిస్తున్నారు. తాజాగా బద్వేలు గెలుపు బాధ్యత సైతం ఆయనకే అప్పగించారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి వైసీపీ గెలుపు కోసం పని చేస్తుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ను టార్గెట్ చేస్తూ..కుప్పంలో మాట్లాడారు. పెద్దిరెడ్డి పుండగి నా అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పుంగనూరులో అసలు పెద్దిరెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానంటూ చంద్రబాబు కుప్పం సభలో సవాల్ చేసారు. పుంగనూరులో పెద్దిరెడ్డి మూడు దశాబ్దాలకు పైగా పట్టు కొనసాగిస్తున్నారు.

కుప్పం బాధ్యతలు పెద్దిరెడ్డికే
ఇక, ఇదే సమయంలో 2024 ఎన్నికల్లో కుప్పం లో వైసీపీ జెండా ఎగురవేయాలనేది పెద్దిరెడ్డి లక్ష్యంగా మారి పోయింది. ఇందు కోసం ఇప్పుడు అక్కడ గతంలో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి మరణించిన చంద్రమౌళి కుమారుడు భరత్ ను క్రియాశీలకంగా బాధ్యతలు అప్పగించారు. భరత్ ను ఎమ్మెల్సీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. బీసీ వర్గానికి చెందిన భరత్ ను బరిలోకి దింపుతారా..లేక, జిల్లాకు చెందిన మరో ముఖ్యనేత నియోజకవర్గం మార్చి చివరి నిమిషంలో కుప్పం బరిలో దించుతారా అనే చర్చ పార్టీలో ఆసక్తి కరంగా సాగుతోంది.

ఇద్దరూ బస్తీమే సవాల్ .. గెలిచేదెవరు
కుప్పం మున్సిపాల్టీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని స్థానిక టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చంద్రబాబు ప్రతిష్ఠకు సవాల్ గా మారుతోంది. ఇదే సమయంలో ముందుగా కుప్పం మున్సిపాల్టీనీ సైతం గెలిచి చంద్రబాబు పైన మానసికంగా పై చేయి సాధించాలని మంత్రి పెద్దిరెడ్డి భావిస్తున్నారు. దీంతో..ఇప్పుడు టీడీపీ శ్రేణులు అటు పుంగనూరులో...వైసీపీ నాయకులు ఇటు కుప్పం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. మొత్తంగా ఈ రెండు నియోజకవర్గాల్లో చిత్తూరు జిల్లాలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications