జగన్ కు చిత్తూరు పోలీసుల షాక్..! 500 దాటితే రౌడీ షీట్..!
ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో తోతాపురి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆరోపిస్తూ వారిని పరామర్శించేందుకు రేపు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు వెళ్లేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఈ టూర్ విషయంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర స్ధాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ చిత్తూరు టూర్ ను ప్రభుత్వంతో పాటు విపక్ష వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ తరుణంలో జిల్లా ఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
రేపు బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ టూర్ కు వస్తున్న వైఎస్ జగన్ తనతో పాటు కేవలం 500 మందిని మాత్రమే అక్కడికి తీసుకెళ్లాలని పోలీసులు ఆంక్షలు విధించారు. మార్కెట్ యార్డ్ లోకి 500 మందిని మాత్రమే అనుమతిస్తామని ఇప్పటికే తేల్చిచెప్పేశారు. అలాగే జగన్ కాన్వాయ్ లో ఉండాల్సిన వాహనాలపై కూడా ముందస్తు ఆంక్షలు విధించారు. అయినా ఈ ఆంక్షల్ని ఉల్లంఘించి జగన్ భారీగా జన సమీకరణ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రేపటి జగన్ టూర్ లో 500 మంది కంటే ఎక్కువ వచ్చిన వారిపై రౌడీ షీట్ తెరుస్తామని ఎస్పీ సుమిత్ కుమార్ హెచ్చరించారు.

వాస్తవానికి జగన్ చిత్తూరు టూర్ ప్లాన్ చేసిన తర్వాత పోలీసుల్ని వైసీపీ నేతలు అనుమతి కోరారు. జగన్ టూర్ కు తగిన భద్రత కల్పించాలని కూడా కోరారు. అలాగే హెలిప్యాడ్ ఏర్పాటుకు అనుమతులు తీసుకున్నారు. అయితే జగన్ టూర్ కు 10 వేల మంది వరకూ వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలు పోలీసులకు తెలిపారు. దీన్ని బట్టి భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ వినతిని పరిశీలించిన పోలీసులు చివరికి కేవలం 500 మందికే బంగారు పాళ్యం మార్కెట్ యార్డ్ లోకి అనుమతిస్తామని తేల్చిచెప్పేశారు. దానికి అంగీకరిస్తేనే అనుమతి ఇస్తామన్నారు. దీంతో చేసేది లేక వైసీపీ నేతలు సరేనన్నారు. అయితే చివరి నిమిషంలో అభిమానుల పేరుతో భారీగా జనసమీకరణ చేసే అవకాశం ఉండటంతో ఇలా ఎస్పీ రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications