లైవ్ లోనే రఘురామకు కోటింగ్.. ! కస్టడీలో ఒప్పుకున్న నిందితులు..!
వైసీపీ రెబెల్ ఎంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణంరాజుపై సీఐడీ కస్టడీలో జరిగిన దాడి కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో సీఐడీ ఛీఫ్ గా ఉన్న పీవీ సునీల్ కుమార్ మరికొందరు సిబ్బందితో కలిసి రఘురామపై కస్టడీలో ఎలా దాడికి పాల్పడ్డారో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులతో పాటు సాక్ష్యులు కూడా తమ తాజా వాంగ్మూలంలో ఈ విషయాలు వెల్లడించారు.
అప్పట్లో సీఐడీ ఛీఫ్ పీవీ సునీల్ కుమార్ ఆదేశాలతోనే రఘురామపై కస్టడీలో దాడి చేసినట్లు ఇందులో పాల్గొన్న సీఐడీ పోలీసులు తాజాగా విచారణలో అంగీకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రఘురామను కొడుతూ వీడియోకాల్‌లో సీఐడీ బాస్‌కు చూపించామని, అప్పట్లో విధులు నిర్వహించిన సీఐ, ఎస్సై, సిబ్బందీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఆయన తన సిబ్బందితో నేరుగా రఘురామను ఉంచిన గదిలోకి వచ్చి దగ్గరుండి కొట్టించారని వెల్లడించారు.

దీంతో ఈ కేసులో అప్పటి సీఐడీ ఛీఫ్ పీవీ సునీల్ కుమార్ పాత్రపై కచ్చితమైన ఆధారాలు దొరికినట్లయింది. అప్పట్లో కస్టడీలో తాము రఘురామను హింసించ లేదని కోర్టులో సీఐడీ అధికారులు తెలిపారు. దీనిపై రఘురామ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు మెడికల్ టీమ్ ను ఏర్పాటు చేసి ఆయనకు పరీక్షలు కూడా చేయించింది. ఇందులో రఘురామపై దాడి జరిగినట్లు నిర్ధారణ అయింది. దీంతో అప్పట్లో అరెస్టు అయిన రఘురామకు బెయిల్ కూడా లభించింది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామరాజు.. మాజీ సీఎం జగన్, అప్పటి సీఐడీ విభాగాధిపతి సునీల్‌కుమార్, నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, దర్యాప్తు అధికారి విజయపాల్, అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చి విచారించాలని ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు సీఐడీ చీఫ్ సెల్‌ఫోన్ లొకేషన్ కూడా తీసుకున్నారు. దర్యాప్తును కొలిక్కి తెచ్చారు.












Click it and Unblock the Notifications