సీజేఐ ఎన్వీ రమణతో సీఎం జగన్ భేటీ - భారతితో సహా : గంటకు పైగా భేటీ -సర్వత్రా ఆసక్తి..!!
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తో సీఎం జగన్ భేటీ అయ్యారు. కడప పర్యటన ముగించుకొని గన్నవరం చేరుకున్న సీఎం జగన్ తన సతీమణితో కలిసి సీజేఐ ఎన్వీ రమణ దంపతులతో సమావేశమయ్యారు. మూడు రోజుల ఏపీ పర్యటన కోసం వచ్చిన సీజేఐ కు ఏపీ ప్రభుత్వం ఆతిథ్యం ఇచ్చింది. ఆయన ఏపీలో పర్యటించే ప్రాంతాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున..సీఎం జగన్ - జస్టిస్ ఎన్వీ రమణ ఫొటోలతో స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. జస్టిస్ రమణ తన స్వగ్రామంకి వచ్చే సమయంలోనూ.. పొన్నవరంలో జరిగిన పౌర సన్మానంలోనూ ఏపీ మంత్రులు హాజరయ్యారు.

సీజేఐకు ఏపీ ప్రభుత్వం ఆతిథ్యం
ఇక, ఈ రోజు ఉదయం ఇంద్రకీలాద్రి పై ఉన్న కనకదుర్గ అమ్మవారి దర్శనం సమయంలోనూ ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ సాయంత్రం సీఎం జగన్ ఏపీ ప్రభుత్వం తరపున సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు తేనేటి విందు ఏర్పాటు చేసారు. అందులో సీజేఐ తో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఆహ్వానించారు. తన కేబినెట్ సహచరులను వారికి సీఎం పరిచయం చేయనున్నారు. ఆ తరువాత ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చే విందులో సీజేఐ ఎన్వీ రమణ హాజరవుతారు. అయితే, ఇప్పుడు సీఎం జగన్ సీజేఐ తో గంటకు పైగా భేటీ అవటం ఆసక్తి కరంగా మారుతోంది.

సీజేఐతో సీఎం జగన్ గంటకు పైగా సమావేశం
సోషల్ మీడియా వేదికగా ఏపీలో గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు సీజేఐ కి సీఎం తేనేటి విందు ఏర్పాటు చేయటం... విజయవాడకు వస్తూనే మర్యాదపూర్వకంగా కలవటంతో ఈ మొత్తం పరిణామాల పైన సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇక, సాయంత్రం సీఎం ఇచ్చే తేనేటి విందులోనూ వీరందరూ మరోసారి కలుసుకోనున్నారు. ఆదివారం సీజేఐ ఎన్వీ రమణ అమరావతిలోని నేలపాడులో ఉన్న హైకోర్టుకు వెళ్లనున్నారు.

జస్టిస్ ఎన్వీ రమణకు సీఎం జగన్ తేనేటి విందు
అక్కడ బార్ అసోసియేషన్ ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. సీజీఐ హోదాలో తొలి సారి అమరావతి గ్రామాల్లోకి జస్టిస్ ఎన్వీ రమణ రానున్నారు. ఇక, రాష్ట్ర స్థాయి న్యాయాధికారుల సమావేశంలో నూ సీజేఐ కీలకోపన్యాసం చేయనున్నారు. రాజభవన్ లో గవర్నర్ సైతం సీజేఐ కి తేనేటి విందు ఇవ్వనున్నారు. తన సొంత రాష్ట్రం.. స్వగ్రామంలో పర్యటిస్తున్న ఎన్వీ రమణకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం అందిస్తోంది.












Click it and Unblock the Notifications