Chandrababu: చంద్రబాబు వైఖరిలో మార్పు.. కిక్కురుమనకుండా సైలెంటైన నేతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి వైఖరిలో మార్పు స్పష్టంగా కనపడుతోంది. పాత తరం రాజకీయవేత్త కాబట్టి కాస్తంత విలువలు, నైతికత అంటూ పాత చింతకాయపచ్చడిలా మాట్లాడుతుండేవారు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరి, ప్రభుత్వ వైఖరి చూసిన తర్వాత కాలానికి అనుగుణంగా తాను కూడా మారాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఆ మార్పులో భాగమే ప్రత్యర్థులపై మాటల తూటాలు.
ఎవరినీ ఎక్కడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెబుతుండటంతో ఇటీవల వరకు తెలుగుదేశంపార్టీతోపాటు చంద్రబాబునాయుడిపై ఎగిరెగిరిపడ్డ నాయకులు, కొందరు అధికారులు కూడా సైలెంటయ్యారు. చంద్రబాబులో ఇటువంటి వైఖరి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేదని ఆయనతో కొన్ని సంవత్సరాల నుంచి సన్నిహితంగా ఉండేవారు చెబుతున్నారు.

మేం తలచుకుంటే ఇవన్నీ ముందే జరిగేవా?
తాము తలచుకుంటే జగన్ యాత్ర చేసేవారా? లేదంటే ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలను చంపేస్తున్నవారు ఉండగలిగేవారా? హత్యారాజకీయాలు మనకెందుకు? రాష్ట్రాభివృద్ధి కావాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళుతుంటే అనవసరంగా వైసీపీ వారు కయ్యాటకు దిగుతున్నారని, తొందరపడొద్దని త్వరలోనే కీలెరిగి వాత పెట్టేరోజు దగ్గరుందని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు.
ఏమనుకుంటున్నారో.. తోక కత్తిరించి పంపిస్తా..
ఒక మంత్రి మహానాడు జరగనివ్వనని మాట్లాడుతున్నారు.. ఏదీ ఆయన ఆపితే మహానాడు ఆగుతుందా? ఆపమనండి.. ఒంగోలులో మహానాడు జరుపుకోవడానికి సభ ఇవ్వరా? వైసీపీకి ఎవరైతే ఊడిగం చేస్తున్నారో ఆ అధికారులందరి తోక కత్తిరించి పంపిస్తా. తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు చించేసే సాహసం చేస్తారా? ఎంత ధైర్యం.. నాకు కోపం వస్తే ఎవరినీ వదిలిపెట్టను.. అందరూ మర్యాదగా ఉంటే నేను కూడా మర్యాదగా ఉంటా.. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్..

చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం
తెలుగుదేశం పార్టీ నాయకులను వేధించేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంతకు ఇంత చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం. ఏమనుకుంటున్నారో.. ఖబడ్దార్!! మహానాడు అనేది ఒక ప్రభంజనం.. ప్రజలు కట్టలు తెంచుకొని వస్తారు... ఇలాంటివన్నీ చంద్రబాబు ఉపయోగిస్తున్న డైలాగులు. ఈ తరహా మాటలను చంద్రబాబు నోటివెంట ఎప్పుడూ వినలేదని తెలుగుదేశం పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే కొత్త చంద్రబాబును చూడటం ఖాయమంటున్నారు.












Click it and Unblock the Notifications