స్థానిక ఎన్నికల్లో జనసేన-బీజేపీ సీట్ల డిమాండ్ వేళ చంద్రబాబు కీలక నిర్ణయం, ఏరి కోరి..!!
ఏపీలో స్థానిక ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి - వైసీపీ మధ్య స్థానిక ఎన్నికలు హోరా హోరీగా మారుతున్నాయి. రెండు వైపులా వీటిని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. ఇదే సమయంలో సీట్ల షేరింగ్ పైన కూటమిలో ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ, జనసేన తాము బలంగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయాలని భావిస్తున్నాయి. దీంతో.. ఎన్నికల కోసం పాలనా పరమైన నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు.. ఇటు పార్టీ పరంగానూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయమే ఇప్పుడు ఎన్నికల్లో కీలకంగా మారనుంది.
స్థానిక ఎన్నికల కోసం సీఎం చంద్రబాబు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనా పరంగా తాజాగా ఉద్యోగులకు డీఏలు, కొత్త పెన్షన్లకు దరఖాస్తులు వంటి నిర్ణయాలు తీసుకున్న సీఎం.. ఇక రాజకీయంగానూ నిర్ణయాలు మొదలు పెట్టారు. స్థానిక ఎన్నికల్లో తొలి సారి టీడీపీ మిత్రపక్షాలతో కలిసి పోటీకి దిగుతోంది. మిత్రపక్షాలు బీజేపీ, జనసేన సీట్ల విషయంలో ఇప్పటికే తమ కమిటీల ద్వారా సంప్రదింపులు మొదలు పెట్టాయి. తమకు బలం ఉన్న సీట్లు కేటాయించాలని ఒత్తిడి పెంచుతున్నాయి. తాజా ప్రతిపాదనల పైన చంద్రబాబు - పవన్ - మాధవ్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే.. ఇదే సమయంలో జిల్లాల వారీగా మిత్రపక్షాలతో సమన్వయం.. పోటీ అభ్యర్ధుల ఖరారు.. కూటమి గెలుపు కోసం చంద్రబాబు పార్టీ నేతలకు బాధ్యత లు అప్పగించారు.

జిల్లాలకు ఇంఛార్జ్ ల నియామకం
ఏరి కోరి ఎంపిక చేసిన నేతలకు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. వీరు జిల్లాలో మిత్రపక్షాలకు కేటాయించాల్సిన సీట్లు.. వారి బలాలు- బలహీనతలతో పాటుగా.. పార్టీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న వారి జాబితాలను ఖరారు చేసి పార్టీ నాయకత్వానికి సిఫారసు చేయనున్నారు. ఇందు కోసం పార్వతీపురం మన్యం జిల్లాకు దాడి రత్నాకర్, అల్లూరి సీతారామరాజు జిల్లాకు పేరాబత్తుల రాజశేఖర్, శ్రీకాకుళం జిల్లాకు ఎండీ నజీర్, విజయనగరం జిల్లాకు ఎంపీ చింతకాయల విజయ్, విశాఖపట్నం ఎంఏ షరీఫ్, అనకాపల్లి జిల్లాకు కొండపల్లి అప్పలనాయుడు, పోలవరం జిల్లాకు కె సత్తిబాబు, కాకినాడ జిల్లాకు సుజయ్ కృష్ణరంగారావు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఎంపీ సానా సతీష్, తూర్పుగోదావరి జిల్లాకు దేవినేని ఉమామహేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లాకు ఎంపీ భాష్యం రామకృష్ణ, ఏలూరు జిల్లాకు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, కృష్ణా జిల్లాకు కొమ్మాలపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లాకు మక్కెన మల్లికార్జునరావు, గుంటూరు జిల్లాకు ఎంవీ సత్యనారాయణరాజు, పల్నాడు జిల్లాకు కొనకళ్ల నారాయణ, బాపట్ల జిల్లాకు జంగా కృష్ణమూర్తి, ప్రకాశం జిల్లాకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కి బాధ్యతలు అప్పగించారు.
అదే విధంగా మార్కాపురం జిల్లాకు ఎమ్మెల్సీ బీటీ నాయుడు, నెల్లూరు జిల్లాకు ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, తిరుపతి జిల్లాకు నూకసాని బాలాజీ, చిత్తూరు జిల్లాకు దామచర్ల సత్య, కడప జిల్లాకు దీపక్ రెడ్డి, అన్నమయ్య జిల్లాకు ఎమ్మెల్సీ శ్రీకాంత్, అనంతపురం జిల్లాకు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, శ్రీసత్యసాయి జిల్లాకు సోమిశెట్టి వెంకంటేశ్వర్లు, కర్నూలు జిల్లాకు పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, నంద్యాల జిల్లాకు వైకుంఠం ప్రభాకర్ చౌదరిలను నియమించారు. ఈ నెల 15వ తేదీ తరువాత ఏ క్షణమైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో.. జిల్లాలకు వెళ్లి.. నియోజకవర్గాల వారీగా స్థానిక సమరం కోసం కేడర్ ను సిద్దం చేయాలని నిర్దేశించారు.













Click it and Unblock the Notifications
