వారిని వదిలిపెట్టేది లేదు - చంద్రబాబు హెచ్చరిక..!!
భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసారు. రెవెన్యూ సమస్యలకు కారణమై అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. ప్రతీ మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోందని తెలిపారు. 100 రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నీ గాడిలో పెడతామని ముఖ్యమంత్రి తెలిపారు.
జిల్లా స్థాయిలోనే ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభిస్తామన్నారు.
చంద్రబాబు ప్రజాదర్బార్
ఎన్టీఆర్ భవన్ లో సీఎం చంద్రబాబుకు వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వారితో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది. గత ఐదు సంవత్సరాలలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు తీసుకున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామంటూ సీఎంకు పలువురు వినతులు ఇచ్చారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

పరిష్కరిస్తాం
వినతులు అన్నింటిని పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ఐదు సంవత్సరాలలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రికార్డులు కూడా తారుమారు చేశారన్నారు. రీ సర్వే అస్తవ్యస్తంగా జరగటం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు వెల్లడించారు. ప్రతీ జిల్లాలో కూడా రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రెవెన్యూ శాఖను ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారో మదనపల్లి ఘటనే ఓ ఉదాహరణ అని చంద్రబాబు పేర్కొన్నారు.
కఠిన చర్యలు
భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని ఆయన అన్నారు. వచ్చిన వినతులన్నీ శాఖల వారీగా విభజించి నిర్దిష్ట కాలపరిమితి లోపు పరిష్కారమయ్యేలా కార్యాచరణ రూపొందించుకున్నామని తెలిపారు. ప్రజలు దూర ప్రయాణాలు చేసి అమరావతి వరకూ రాకుండా జిల్లాల వారీగా మంత్రులు, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు వినతులు తీసుకునేలా ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. తన పర్యటనల సందర్భంగా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా పోలీసు వ్యవస్థలోనూ మార్పులు తెస్తామని చంద్రబాబు వెల్లడించారు.












Click it and Unblock the Notifications