ఇక పదవులు వారికే - తేల్చేసిన చంద్రబాబు..!!
టీడీపీని మరింతగా బలోపేతం చేయటం పైన సీఎం చంద్రబాబు ఫోకస్ చేసారు. అందులో భాగంగా కీలక నియామకాల పైన కసరత్తు మొదలు పెట్టారు. యువతకు ఎక్కువగా అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. పార్టీలో కింది స్థాయి నుంచి పై వరకు బలమైన నిర్మాణం చేస్తున్నారు. పార్లమెంటు కమిటీల నియామకం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సోషల్ ఇంజనీరింగ్ జరగాలని నిర్దేశించారు. మొహమాటాలకు పోయి బలహీనంగా ఉన్న వారికి పదవులు ఇస్తే ప్రభుత్వం, పార్టీ కూడా నష్టపోతాయని పేర్కొన్నారు.
పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన సీఎం చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణ పైన దిశా నిర్దేశం చేసారు. పార్లమెంటరీ కమిటీల పైన సూచనలు చేసారు. అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలని.. యువతకు అవకాశం కల్పించాలని నిర్దేశించారు. అన్ని వర్గాల నుంచి బలమైన నేతలకు అవకాశం ఇవ్వాని తేల్చిచెప్పారు. ఇప్పటికే పార్టీ పదవుల్లో ఉండి.. కార్పొరేషన్ల చైర్మన్‌లో, ఇతర పదవులో పొందిన వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించనున్నట్టు చంద్రబాబు వివరించారు. పార్టీలో ప్రతి ఒక్కరూ చాలా బాధ్యతగా ఉండాలని చంద్రబాబు సూచించారు. పార్టీ, ప్రభుత్వ స్థాయిని పెంచేలా నేతల తీరు ఉండాలన్నారు. ఆరోపణలు రాకుండా చూసుకోవాలని, తప్పు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించబోనని తేల్చి చెప్పారు.

గీత దాటిన వారికి సెకండ్ ఛాన్స్ ఉండదని చంద్రబాబు తేల్చి చెప్పారు. కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ఎంపీల వరకు ఎవ్వరిపైనా ఆరోపణలు రాకూడదనే లక్ష్యంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఎవరి కారణంగా పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరగకూడదనే బాధ్యతతో పని చేయండి. ప్రజాప్రతినిధులు కార్యకర్తలకు సమయం ఇచ్చి సమస్యలు పరిష్కరించాలి. మిత్రపక్షాలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు.
వచ్చే నెల 6న అనంతపురంలో 'సూపర్ సిక్స్.. సూపర్ హిట్' కార్యక్రమం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. మరోవైపు, వచ్చే నెల 1 నుంచి పార్టీ క్యాడర్‌కు శిక్షణ తరగతులను నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. 24, 25, 26 తేదీల్లో పార్లమెంటు కమిటీలకు ప్రతిపాదనలు స్వీకరించేందుకు సమావేశాలు జరగనున్నాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 34 మంది సభ్యులతో టీడీపీ పార్లమెంటు కమిటీని ఏర్పాటు చేయనున్నారు.












Click it and Unblock the Notifications