కుప్పం ఇన్‌ఛార్జి ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఔట్, ఆ స్థానంలో - నేతలపై చంద్రబాబు ఫైర్..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గం కుప్పంలో పార్టీ ప్రక్షాళన ప్రారంభించారు. పార్టీ నేతల పై వస్తున్న ఫిర్యాదుల పైనా సీరియస్ అయ్యారు. ఇప్పటి వరకు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ ను తప్పించారు. ఆ స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో నేతలంతా విమర్శలకు దూరంగా వ్యవహరించాలని నిర్దేశించారు. కుప్పం లో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యల పైన స్పష్టత ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ఇన్‌ఛార్జి ఉన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను తప్పించారు. ఆయన స్థానంలో అనంతపురానికి చెందిన యువకుడు, పార్టీ తరఫున పీ4 పథకాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీకాంత్‌కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. కుప్పం నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ను కుప్పం బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఆయనకు రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తానని చెప్పారు. కంచర్ల స్థానంలో అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి కుప్పం బాధ్యతలు అప్పగిస్తానని, ఆయన ఆదేశాల ప్రకారం పార్టీ శ్రేణులు నడచుకోవాలని సూచించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్సీ శ్రీకాంత్ తాను అధినేత ఆదేశాలను శిరసావహిస్తానని అన్నారు. ఇంతకాలం తనకు సహకరించిన నియోజకవర్గ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు చెప్పి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. చంద్రబాబు 1989లో కుప్పం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కుప్పం నేతలకు చంద్రబాబు క్లాస్
కుప్పంలో చంద్రబాబు తన తరఫున బాధ్యతలు నిర్వహించేందుకు తిరుపతికి చెందిన మనోహర్‌ను పీఏగా పెట్టుకున్నారు. మనోహర్ అనారోగ్యానికి గురికావడంతో ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను నియమించారు. శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్థానిక నాయకులను కలుపుకొనిపోవడంలో విఫలమయ్యారు. ఆయన తీరుపై ఫిర్యాదులు ఎక్కువవుతుండడంతో ఆయన్ను పక్కనపెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. అనంతపురానికి చెందిన శ్రీకాంత్‌కు ఆ బాధ్యత కట్టబెట్టారు. సమావేశంలో పాల్గొన్న నేతలకు ఆయన్ను పరిచయం చేశారు. విజయవాడలోని ప్లానింగ్ కార్యాలయంలో ఇంజనీర్‌గా పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ-4 కార్యక్రమానికి హిందూపురం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఏడాదిగా పనిచేస్తున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గం లో నేతలు పనితీరు మార్చుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. అక్రమ కార్యకాపాలకు పాల్పడితే ఎంతటివారైనా పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసులు బుక్ చేయిస్తానని స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications