శ్రీవారికి జైన మతస్థుడు 122 కిలోల బంగారం కానుక, అన్న ప్రసాదంలో కొత్తగా..!!
Tirumala: ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు తిరుమలకు తరలి వస్తారు. దర్శనం.. వసతి విషయంలో టీటీడీ కొత్తగా మార్పులు తీసుకొచ్చింది. ఏఐ వినియోగంతో మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ శక్తి కొద్దీ ముడుపులు చెల్లించుకుంటారు. మరి కొంత మంది స్వామి వారి మీద విశ్వాసంతో భారీ విరాళాలు ఇస్తూ ఉంటారు. కాగా, ఒక జైన మతస్థుడు శ్రీవారికి 122 కిలోల బంగారం కానుకగా ఇచ్చారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠ ఏకాదశికి టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారికి వచ్చిన కానుకల గురించి సీఎం చంద్రబాబు ఆసక్తి కర అంశాలు వెల్లడించారు. వేంకటేశ్వరస్వామి ఎంతో మహిమ గల దేవుడని, ఒక జైన మతస్థుడు స్వామిపై భక్తితో 122 కిలోల బంగారం కానుకగా సమర్పించారని సీఎం తెలిపారు. ఇటీవల జైన మతస్థుడైన ఒక భక్తుడు తనను కలిసినప్పుడు ఆయన అనుభవం చెప్పారన్నారు. ఆయన తన వ్యాపారంలో కొంత వాటాను విక్రయించడంతో రూ.5 వేల కోట్లు వచ్చిందని, ఆయన స్వామివారికి 122 కిలోల బంగారం ఇస్తానని మొక్కుకున్నట్లు తెలిపారన్నారు. మొక్కు తీర్చేందుకు తిరుమల వెళ్లి అధికారుల్ని కలిస్తే శ్రీవారికి రోజూ 121 కిలోల బరువైన ఆభరణాలు అలంకరిస్తామని వారు మాటల సందర్భంలో ఆయనకు చెప్పారని చంద్రబాబు వివరించారు.

122 కిలోల బంగారం కానుకగా సమర్పించాలని ఆ స్వామివారే తనకు సందేశం పంపినట్లుగా ఆ భక్తుడు భావించారన్నారు. స్వామివారికి ఎంత మహత్యం లేకపోతే ఒక భక్తుడు 122 కిలోల బంగారం ఇస్తారని, స్వామివారిని దర్శించుకునేందుకు రోజూ లక్ష మంది ఎందుకు వస్తారని. ఆయన పై భక్తుల నమ్మకం అలాంటిదని చంద్రబాబు చెప్పారు. ఇక, తిరుమలలో శ్రీవారి భక్తుల కు అన్న ప్రసాదం తయారీలో వాడే దినుసులను జల్లెడ పట్టేందుకు ఏఐ టెక్నాలజీని వాడుతున్నామ ని చంద్రబాబు తెలిపారు. బియ్యం, ఇతర దినుసుల్లో ఏ అన్య పదార్థం వచ్చినా ఏఐ టెక్నాలజీతో గుర్తించి యంత్రం వాటిని ఏరివేస్తుందని చెప్పారు. అదే విధంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యమైన నెయ్యి, దినుసులు వాడుతున్నామని, అన్నప్రసాదంపై ఒక్క ఫిర్యాదు కూడా లేదని చంద్రబాబు వెల్లడించారు.












Click it and Unblock the Notifications