ఎందుకిలా, ఇక వెయిట్ చేయను - మంత్రులతో తేల్చేసిన చంద్రబాబు..!!
మంత్రులకు సీఎం చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. పని తీరు మెరుగు పర్చుకోవటం తో పాటుగా స్పీడ్ పెరగాలని నిర్దేశించారు. మంత్రులు చురుగ్గా పనిచేయాలని చెప్పారు. రాష్ట్రంలో జరిగే సంఘటనలపై ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు. ప్రభుత్వం చేసే పనులనూ చెప్పుకోలేకపోతే ఎలా అని నిలదీసారు. ఉచిత ఇసుక గురించీ చెప్పలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేసారు. పని తీరులో తనతో పోటీ పడాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు.
ఎందుకు స్పందించరు
మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు తన కేబినెట్ సహచరులకు కీలక సూచనలు చేసారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇన్‌చార్జి, స్థానిక మంత్రులు తక్షణమే స్పందించాలని సూచించారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా మంత్రులు ప్రచారం చేసుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేసారు. ఉచిత ఇసుక విధానం ప్రకటించి 15 రోజులవుతున్నా.. ప్రజలకు ఆ విషయాలను సరిగా చెప్పలేకపోతున్నారని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇసుక బాధ్యతను జిల్లా, ఇన్‌చార్జి మంత్రులు తీసుకోవాలన్నారు. విజయనగరం జిల్లాలో డయేరియాలాంటి సంఘటనలపై స్థానికంగా ఉన్న మంత్రులు వెంటనే స్పందించి ఉండాల్సిందని పేర్కొన్నారు.

యాక్టివ్ గా ఉండాలి
బోగస్ పెన్షన్ల రద్దు, పెన్షన్ మంజూరు విధి విధానాలపై 8 మంది మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పైన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. పెన్షన్లు రద్దు చేసేందుకు ప్రస్తుతమున్న ఆరంచెల విధానాన్ని కూడా ఎత్తివేయాలని తీర్మానించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూపొందించిన అర్హతల ఆధారం గా పెన్షన్లు మంజూరుచేయాలని, తప్పుడు విధానంలో అనర్హులెవరైనా పెన్షన్లు పొందినట్లు ఫిర్యాదులు వస్తే గ్రామసభలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తోందని.. రూ.100 కోట్లతో పలు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తోందని, ఈ విషయాలపై కూడా ప్రజల్లో ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.#AndhraPradesh pic.twitter.com/QDEGIEzWBm
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 23, 2024
నవ నిర్మాణ దీక్ష
కేబినెట్ భేటీలో రాష్ట్రావతరణ దినోత్సవం ఎప్పుడు జరపాలనే అంశంపై చర్చ జరిగింది. పొట్టి శ్రీరాములు 1952 డిసెంబరు 15న ఆత్మార్పణ చేశారని, 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైతే.. ఉమ్మడి ఏపీ నవంబరు 1న ఆవిర్భవించిందని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీ జూన్ 2న విడిపోయిన తేదీపైనా చర్చ జరిగింది. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణను తెలుగుజాతి గుర్తించాలని సీఎం పేర్కొన్నారు. జూన్ 2న ఏర్పడిన నవ్యాంధ్రను ఎలా గుర్తించాలనే అంశంపైనా చర్చ జరిగింది. 2014 -19 టీడీపీ హయాంలో జూన్ 2 నుంచి వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్షలు చేపట్టామని మంత్రులు గుర్తు చేసారు. దీంతో, జూన్ 2న నవ నిర్మాణ దీక్ష చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications