కేంద్రం వరద సాయం విడుదలపై పురందేశ్వరి ట్వీట్-అదేం లేదన్న చంద్రబాబు..!
వరదలతో విలవిల్లాడుతున్న విజయవాడకు కేంద్రం రూ.3300 కోట్ల వరద సాయం అందించినట్లు నిన్న భారీగా ప్రచారం జరిగింది. ఇప్పటికే వరద ప్రాంతాలకు ఆర్మీని పంపడంతో పాటు అవసరమైన సామాగ్రి, హెలికాఫ్టర్లు పంపుతున్న కేంద్రం.. ఈ మేరకు ఆర్ధిక సాయం కూడా చేసిందంటూ ప్రచారం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సైతం కేంద్రం ఏపీ, తెలంగాణకు కలిపి రూ.3300 కోట్లు ఇవ్వడంపై ధన్యవాదాలు చెప్తున్నట్లు ఓ ట్వీట్ కూడా హల్ చల్ చేసింది.
అయితే సీఎం చంద్రబాబు దీనిపై నిన్న రాత్రి క్లారిటీ ఇచ్చారు. విజయవాడలో వరద సహాయక చర్యలపై ప్రతీ రోజూ రాత్రి ప్రెస్ మీట్ పెట్టి వివరాలు అందిస్తున్న సీఎం చంద్రబాబు కేంద్ర సాయంపై అడిగిన ప్రశ్నకు స్పందించారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం రూ.3300 కోట్లు ఇచ్చిందంటూ జరుగుతున్నది కేవలం పుకారు మాత్రమేనని, ఇది కరెక్ట్ కాదన్నారు. ఇంకా తాము కేంద్రానికి వరద సాయంపై రిపోర్టే పంపలేదన్నారు.ఇవాళ ఉదయం కేంద్రానికి నివేదిక ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.


మరోవైపు విజయవాడలోని వరద ప్రాంతాలతో పాటు ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్ధితిని అంచనా వేసేందుకు కేంద్ర బృందం వచ్చింది. కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు నిపుణులు కూడా ఇందులో ఉన్నారు. వీరు ఇప్పటికే పరిశీలించిన ప్రాంతాలపై కేంద్రానికి తమ నివేదిక అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన నివేదికతో పాటు కేంద్ర బృందం నివేదిక కూడా పరిశీలించాక ఏపికి ఎంత ఇవ్వాలనే దానిపై ప్రధాని ఓ నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications