CM Chandrababu: పోలవరం ప్రాజెక్టును జగన్ నాశనం చేశారు: ప్రాజెక్ట్ పరిస్థితి చెప్పి చండ్రనిప్పులు!!
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉండతగని వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఇదే విధంగా ఉంటుందని మాజీ సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పోలవరం విషయంలో నా కష్టాన్ని బూడిదలో పూసిన పన్నీరు చేశారని మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా అస్తవ్యస్తం అయ్యింది
వైసీపీ ప్రభుత్వం రావడమే రివర్స్ అటెండరింగ్ తో వచ్చిందని, ఆ ప్రభుత్వమే రివర్స్ టెండరింగ్ అని మండిపడ్డారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుని సందర్శించి, సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం చంద్రబాబుప్రాజెక్ట్ కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైందని ఆయన ప్రకటించారు. ప్రాజెక్టును చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతుందన్నారు.

పోలవరం ఏపీ జీవనాడి
పోలవరం ప్రాజెక్టును ఏపీ జీవనాడిగా భావించామని ఆయన గుర్తు చేశారు. 2014 ఎన్నికలలో గెలిచిన తర్వాత పోలవరం ముంపు ప్రాంతంలోని తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయించామని గుర్తు చేశారు చంద్రబాబు. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలను ఏపీలో విలీనం చేయగలిగామని చంద్రబాబు పేర్కొన్నారు. అప్పటికే పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాల్లో ఉందని, 2005లో వైఎస్ఆర్ ప్రారంభించిన ప్రాజెక్టు పనులపై అప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయన్నారు.
ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించే యత్నం చేశారు
ఇక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం తామెంతో కష్టపడ్డామని గుర్తు చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లోనే వైసిపి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏజెన్సీని మార్చేసిందని అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ డ్యామ్ ఎత్తు 45.72 మీటర్ల ఎత్తు ఉంటే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, ఆ ఎత్తును కూడా తగ్గించడానికి ప్రయత్నించారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ ను నాశనం చేశారు.. డబ్బు వృధా చేశారు
తాము స్పిల్ వే ద్వారా 50 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్లేలా డిజైన్ చేశామని, చైనాలో త్రీ గార్జియస్ ప్రాజెక్టు ద్వారా మాత్రమే అంత ఎక్కువ నీరు డిశ్చార్జ్ అవుతుందని గుర్తు చేశారు. అత్యవసరంగా 480కోట్లతో నిర్మిస్తే నాశనం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. కొంతమేర డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడంతో వరద తాకిడికి డయాఫ్రం వాల్ దెబ్బ తిందన్నారు. దెబ్బతిన్న దానికి సమాంతరంగా మరొకటి నిర్మిస్తే 447 కోట్ల వ్యయం అవుతుందన్నారు.
జగన్ ది మూర్ఖత్వం
మొత్తం కట్టాలంటే 990 కోట్లు అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా నాలుగేళ్ల సమయం పడుతుంది అని చెప్పారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఏమీ తెలియకపోవడం అతని ఇజం, మూర్ఖత్వం అంటూ జగన్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరాన్ని జగన్ భ్రష్టు పట్టించారు
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సరిగా అమలు చేయకుండా ప్రాజెక్టును మరింత నిర్లక్ష్యంగా మార్చారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుని జగన్ భ్రష్టు పట్టించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడం తమకు సవాల్ అని చాలా సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ పరిష్కరించి ముందుకు వెళదామని చంద్రబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications