మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం: సోషల్ మీడియాకు చంద్రబాబు హెచ్చరిక
Chandrababu Naidu: రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సోషల్ మీడియా ద్వారా అసభ్యకర పోస్టులను వేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను వదిలిపెట్టమని స్పష్టం చేశారు.
ఈ మధ్యాహ్నం ఆయన నంద్యాల జిల్లా శ్రీశైలంలో పర్యటించారు. విజయవాడ- శ్రీశైలం మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన సీప్లేన్ ట్రయల్ రన్‌ను ప్రకాశం బ్యారేజీ పున్నమి ఘాట్ వద్ద లాంఛనంగా ప్రారంభించారు. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో కలిసి అక్కడినుంచి అదే సీప్లేన్‌లో శ్రీశైలానికి వచ్చారు.

శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన చంద్రబాబును అర్చకులు, పాలక మండలి సభ్యులు సాదర స్వాగతం పలికారు. మల్లికార్జునుడి దర్శనానంతరం ఆయనకు తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.
ఈ సందర్భంగా శ్రీశైలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. మహిళలు, ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టే వారికి హెచ్చరికలను జారీ చేశారు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటామని, ఆడబిడ్డల జోలికి వస్తే మాత్రం సహించబోమని అన్నారు. వ్యక్తిత్వం హననం చేసే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ దేనికీ భయపడదని, తీవ్రవాదులతో పోరాడామని చంద్రబాబు అన్నారు. ఒక ముఠా నాయకుడిని పూర్తిగా అదుపు చేశామని, మత విధ్వేషాలను రెచ్చగొట్టే నాయకులను నియంత్రించామని చెప్పారు. రౌడీలను లేకుండా చేశామని, రాజకీయ ముసుగేసుకున్న రౌడీల అసలు స్వరూపాన్ని బయటపెట్టామని అన్నారు.
అలాంటి రాజకీయ నాయకులను రౌడీలు, నేరస్తుల్లాగే చూశామని చెప్పారు. ఒకరిద్దరు పోలీసు అధికారులు తప్పు చేసినా, లేదా లాలూచీ పడినా అదే వారి లాస్ట్ వ్యవహారమౌతుందని చంద్రబాబు హెచ్చరించారు. శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని పునరుద్ఘాటించారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగితే పెట్టుబడులు రాబోవని, పర్యాటక రంగం అభివృద్ధి చెందదని చంద్రబాబు చెప్పారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలన, అలాంటి వాతావరణం ఏర్పడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇంకా పేదరికాన్ని పెంచడానికి సిద్ధంగా లేమని వ్యాఖ్యానించారాయన.












Click it and Unblock the Notifications