ఈ సారి అక్కడ పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన తొలి కార్యక్రమం, అమలు చేసిన తొలి హామీ పింఛన్ల పంపిణీ. ఈ నెల 1వ తేదీన రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం ఆరంభమైంది.
ఇప్పుడు మరోసారి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతోన్నారు చంద్రబాబు. ఈ సారి ఆయన శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మడకశిరలో పింఛన్లను పంపిణీ చేయనున్నారు. స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి 4,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అందజేయనున్నారు.

మడకశిర మండలంలోని గుండుమల ఎస్సీ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యాక్రమంలో ఆయన పాల్గొంటారు. జులై నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడే రచ్చబండను నిర్వహించనున్నారు. పింఛన్ లబ్దిదారులతో ముఖాముఖి చర్చిస్తారు.
దీనికి అవసరమైన ఏర్పాట్లన్నింటినీ జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం చకచకా పూర్తి చేస్తోన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు పయ్యావుల కేశవ్, ఎస్ సవిత, వై సత్యకుమార్ ఇందులో పాల్గొననున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం లోక్‌సభ సభ్యుడు బీకే పార్థసారథి సహా జనసేన, బీజేపీకి చెందిన పార్టీ నాయకులు దీనికి హాజరు కానున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 65.31 లక్షలమంది వయోధిక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ మొత్తాన్ని ఇదివరకే పెంచింది చంద్రబాబు ప్రభుత్వం. పింఛన్ కింద గత ప్రభుత్వం 3,000 రూపాయలను చెల్లించగా.. ప్రస్తుతం ఈ మొత్తం 4,000 రూపాయలకు చేరింది.












Click it and Unblock the Notifications