గుడ్ ఫ్రైడే వేళ.. పాస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం
మరి కొద్ది గంటల్లో గుడ్ ఫ్రైడే ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు ఈ పండుగను జరుపుకోనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని పాస్టర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాస్టర్లకు గౌరవ వేతనం కింద నెలకు రూ. 5వేలు చొప్పున ఇవ్వాలని సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ. 5వేల చొప్పున గౌరవ వేతనం విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2024 మే నుంచి నవంబర్ వరకు ఈ గౌరవ వేతనం విడుదల చేయనున్నారు. ఈ 7 నెలల కాలానికి గాను రూ. 30 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడు నెలలకు ఒకొక్క పాస్టర్‌కు రూ.35,000 చొప్పున లబ్ది చేకూరనుంది. సీఎం చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంతో పాస్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
2023 యువగళం పాదయాత్ర సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ..పాస్టర్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వస్తే.. గౌరవ వేతనం అందిస్తామని పాస్టర్లకు లోకేష్ హామీ ఇచ్చారు. ఆ క్రమంలో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం హామీని అమలు చేసింది.

ఇక 2024 మే, జూన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలిచాయి. దీంతో ఏపీ ప్రజలు ఈ కూటమికి విజయాన్ని అందించారు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కూటమి ప్రభుత్వం కొన్ని హామీలను అమలు చేసింది. మరికొన్ని హామీలు అమలు చేయాల్సి ఉంది. రానున్న కాలంలో ఆ హామీలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టనుంది.












Click it and Unblock the Notifications