కనకదుర్గమ్మకు చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ
Chandrababu: రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అన్ని ప్రాంతాలు పండగ శోభను సంతరించుకున్నాయి. అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కోలాహలంగా మారాయి. అదే సమయంలో తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా కొనసాగుతోండటంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది.
12వ తేదీన విజయదశమితో దేవీ శరన్నవరాత్రులు ముగుస్తాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని రోజూ వేలాదిమంది భక్తులు దర్శించుకుంటోన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ వేల సంఖ్యలో భక్తులు దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయానికి బారులు తీరుతున్నారు.

ఏడో రోజున అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి మూలా నక్షత్రం కావడం వల్ల ఈ ఉదయం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చారు. కుమార్తె ఆద్యతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. సేవలో పాల్గొన్నారు.
దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనాలు పలికారు. అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని చిన్ని, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ఈ సందర్భంగా ఆయన వెంట ఉన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొద్దిసేపటి కిందటే కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజల తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. సతీసమేతంగా ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. భార్య భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌తో కలిసి అమ్మవారి సేవలో పాల్గొన్నారు.
ఈ ఉదయం వరకు ఢిల్లీలో తీరిక లేని కార్యక్రమాలతో గడిపారాయన. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చారు. పట్టు వస్త్రాలను సమర్పించారు.
చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు, పాలక మండలి సభ్యులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పట్టువస్త్రాలను సమర్పించిన అనంతరం వారికి ఆశీర్వచనాలు పలికారు. అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.












Click it and Unblock the Notifications