బీఆర్ నాయుడిని మెచ్చుకున్న చంద్రబాబు
TTD: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. కిందటి నెల 28వ తేదీన ధ్వజావరోహణంతో ఆరంభమైన ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ వరకు వైభవంగా కొనసాగాయి. పంచమీ తీర్థం, పుష్పయాగంతో ముగిశాయి. పంచమీ తీర్థం సందర్భంగా వేలాదిమంది భక్తులు పుష్కరణిలో పుణ్యస్నానాలను ఆచరించారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ వాహన సేవల్లో పాల్గొన్నారు. 3వ తేదీన నిర్వహించిన గరుడ వాహనం, 10వ తేదీన చేపట్టిన రథోత్సవంలో తిరుచానూరు భక్తులతో కిటకిటలాడింది.

తిరుచానూరు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అభినందించారు. ఛైర్మన్ బీఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది భక్తులకు అందించిన సేవల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల దివ్య వైభవాన్ని వీక్షించడం నిజంగా ఆనందంగా ఉందని అన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా టీటీడీ వీటిని నిర్వహించిందని ప్రశంసించారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటం వల్ల ముందు చూపుతో వ్యవహరించారని కితాబిచ్చారు.
ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకుని, క్షేత్ర స్థాయిలో దాన్ని విజయవంతంగా అమలు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. లక్షలాది మంది భక్తులకు పద్మావతి అమ్మవారి దర్శనం భాగ్యం కలిగేలా, ఆశీస్సులు అందేలా చేశారని కితాబిచ్చారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, లోటుపాట్లు రానివ్వకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు పాలక మండలి యంత్రాంగం, జిల్లా పోలీసులు, తిరుచానూరు పంచాయతీ అధికారులు సమన్వయంతో భక్తులకు అన్నప్రసాదం, మంచినీరు, పారిశుద్ధ్యం, క్యూలైన్ల నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications