కుప్పానికి చంద్రబాబు భారీ హామీలు- రౌడీయిజం చేస్తే అదే చివరి రోజని వైసీపీకి వార్నింగ్..!
ఏపీలో వరుసగా ఎనిమిదోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు ఇవాళ పర్యటిస్తున్నారు. రెండురోజుల పర్యటనకు కుప్పం వెళ్లిన చంద్రబాబు.. బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఇప్పటివరకూ 9సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే అందులో 8 సార్లు కుప్పం నుంచే ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తుచేశారు.మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానన్నారు. తనపై కుప్పం ప్రజలు ఎప్పుడూ నమ్మకం ఉంచారన్నారు.
ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించారన్నారని చంద్రబాబు గుర్తుచేశారు. ఎవరైనా విర్రవీగితే ఇదే గతి పడుతుందన్నారు.ఈసారి ఎన్నికల్లో బాగా చదువుకున్న వారికి, యువతకు సీట్లు ఇచ్చి గెలిపించామన్నారు. కేబినెట్లో 8 మంది బీసీలకు అవకాశం ఇచ్చామని తెలిపారు. ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక పోలవరం, అమరావతి వెళ్లాక కుప్పం ప్రజా దేవుళ్లను కలిసేందుకు ఇక్కడికి వచ్చానన్నారు.

ఐదేళ్లలో మీ రుణం తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంతా ఉపయోగించి కుప్పంను అగ్రస్థానంలో నిలబెడతానన్నారు. పేదరికం లేని సమాజం తన లక్ష్యమన్నారు. 1989లో తాను ఇక్కడి నుంచి తొలిసారి గెలిచాక రోడ్లు లేవని, టెలిఫోన్లు లేవని, కానీ వెనుకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే కుప్పాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. 2019 నుంచి 2024 వరకూ తన జీవితంలో ఓ పీడకలగా చంద్రబాబు అభివర్ణించారు. అరాచకం, అప్రజాస్వామ్యం, దాడులు, దౌర్జన్యాలు చేశారన్నారు.
కుప్పంలో అన్న క్యాంటీన్ పెట్టి భోజనం పెడదామంటే వైసీపీ చేసిన దౌర్జన్యం గుర్తించుకోవాలన్నారు. ఓ మాజీ సీఎంగా, విపక్ష నేతగా తాను అక్కడికి వెళ్తే దిక్కులేదన్నారు. తాను కుప్పానికి వస్తుంటే జీవో నంబర్ 1 తెచ్చి 30 మంది వరకూ అరెస్టు చేసి జైల్లో పెట్టారన్నారు. అదంతా మర్చిపోతామా అని అడిగారు. ఆ తర్వాత తననూ జైల్లో పెట్టారన్నారు. బాధా, ఆవేదన ఉంది కానీ తనకు ఎవరిమీదా కోపం లేదని చంద్రబాబు తెలిపారు. కుప్పం ప్రజల మీద అభిమానం మాత్రం ఉందన్నారు.
#WATCH | Hon'ble Chief Minister Nara Chandrababu Naidu Garu inspected the Handri-Neeva Sujala Stream Canal in Kuppam today. pic.twitter.com/gPzJSYBjXK
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 25, 2024
కుప్పం ఓ ప్రశాంతమైన ప్రాంతమని, మీకు ప్రశాంతత కావాలా వద్దా అని ప్రజల్ని అడిగారు. ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా, కుప్పంలో రౌడీఇజం చేస్తే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ప్రశాంతమైన కుప్పంలో రౌడీయిజం, గంజాయి, అక్రమ వ్యాపారాలు చేయడానికి వీల్లేదన్నారు. ఐదేళ్ల కోసం సంక్షేమ అజెండాతో వచ్చానని, దానికి చిరునామాగా కుప్పాన్ని మారుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
కుప్పం మున్సిపాలిటీలో పన్నులు పెంచారు కానీ అభివృద్ధి చేశారా అని అడిగారు. ఓ మోడల్ మున్సిపాలిటీగా కుప్పాన్ని తయారు చేస్తామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు టౌన్ లోకి అన్ని రోడ్లు వేస్తామని, డ్రైనేజీలు ఏర్పాటు చేయించి ఓ పరిశుభ్రమైన నగరంగా కుప్పం టౌన్ ను తయారు చేసే బాధ్యత తనదే అన్నారు. కుప్పంతో పాటు నాలుగు మండల కేంద్రాలనూ అభివృద్ధి చేస్తానన్నారు. కుప్పానికి త్వరలో ఎయిర్ పోర్టు కూడా తెస్తానన్నారు.












Click it and Unblock the Notifications