రాజధాని: ధరలు పెరుగుతుండగానే.., ఆపేయాలని ఏపీ
హైదరాబాద్: విజయవాడ - గుంటూరు మధ్య, అమరావతి కేంద్రంగా రాజధాని రానుందనే వార్తల నేపథ్యంలో అక్కడి భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఓ వైపు భూముల ధరలు పెరుగుతుండగానే.. పలువురు రియాల్టర్లు ప్రస్తుతం తక్కువ ధరలకు అక్కడ భూములను కొని రాజధానిని ఏర్పాటు చేశాక ఎక్కువ ధరలకు అమ్ముకునేందుకు సిద్ధమయచ్యారు. ఇందుకోసం వారు పరిసర ప్రాంతాల్లో భూములను కొంటున్నారు.
దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. భూముల రిజిస్ట్రేషన్లు ఆపేయాలని అధికారులను ఆదేశించింది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు మాట్లాడుతూ.. విజయవాడ - గుంటూరుల మధ్య రాజధాని ఉండవచ్చునని చెప్పిన విషయం తెలిసిందే. మంత్రులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

దీంతో.. ఆ ప్రాంతాల్లో భూముల విలువ క్రమంగా పెరుగుతోంది. దీనిని రియాల్టర్లు సొమ్ము చేసుకుందామని భావిస్తున్నారట. ఇందుకోసం ఆ ప్రాంతాల్లో వారు భూములను కొంటున్నారట. రాజధానిని ఏర్పాటు చేశాక.. ప్రభుత్వానికి ఎక్కువ మొత్తానికి అమ్మాలనే భావనలో ఉన్నారట.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా కలుగజేసుకొంది. భూముల రిజిస్ట్రేషన్లను ఆపేయాలని సూచించింది. రాజధానిని ఏర్పాటు చేయడంతో పాటు.. అభివృద్ధిని వికేంద్రీకరించాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగతా నగరాల్లో కూడా భూములను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.












Click it and Unblock the Notifications