ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ - దసరా కానుకగా..!!
ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. పెండింగ్ లో ఉన్న రెండు డీఏల్లో ఒకటి దసరాకు విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య ఉద్యోగులే వారధిగా పేర్కొన్నారు. ఏ ప్రభుత్వంతో పోల్చినా ఉద్యోగులకు మేలు చేసే విషయంలో మెరుగ్గా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులదని చెప్పిన ముఖ్యమంత్రి, మంచి చేసే విషయంలో నాలుగు అడుగులు ముందుకు వేస్తామని హామీ ఇచ్చారు.
ఉద్యోగులకు డీఏ విడుదల : ఏపీ ఎన్జీవో 21వ రాష్ట్ర మహాసభలకు ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. తన ప్రభుత్వం ఏర్పాటు అయిన సమయం నుంచి ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేసారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులదని..మంచి చేసే విషయంలో ముందు ఉంటుందని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు రెండు డీఏలు బకాయి ఉండగా, జూలై 2022 డీఏను దసరా నాటికి విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

మహిళా ఉద్యోగుల అదనపు మెడికల్ లీవ్స్ విషయంలోనూ ఉద్యోగుల డిమాండ్ కు ఆమోదం తెలిపారు. ఉద్యోగుల ప్రయోజనాల్లో ఎక్కడా వెనక్కు తగ్గబోమని ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2.06 లక్షల ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదకన కల్పించామని సీఎం జగన్ వివరించారు.
రోల్ మోడల్ గా జీపీఎస్ : ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన గ్యారంటీ పెన్షన్ స్కీం దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని సీఎం జగన్ చెప్పారు. సీపీఎస్ పైన అధ్యయనం..పరిష్కారం కోసం అనేక రకాల అధ్యయనాలు చేసామని వివరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ పెన్షన్ గ్యారంటీ స్కీం తీసుకొచ్చామన్నారు.
ప్రభుత్వంపైన అసాధారణ భారం పడి, భవిష్యత్ లో చేతులెత్తేసే పరిస్థితి రాకుండా నిర్ణయం తీసుకున్నామన్నారు. అదే సమయంలో ఉద్యోగుల పదవీ విరమణ తరువత వారంతా చిరునవ్వుతో ఉండానే తాపత్రంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పిన ముఖ్యమంత్రి.. ఈరోజు లేదా రేపు ఆర్డినెన్స్ జారీ అవుతుందని వెల్లడించారు. అమలు చేయలేమని తప్పించుకోకుండా, అవకాశం మేర చేసామని చెప్పుకొచ్చారు.

ప్రతిపక్షాలకు కడుపుమంట : ప్రతిపక్షాలకు తన మీద కడుపుమంట ఉందని, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. వారి మాటలు నమ్మవద్దని సూచించారు. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు మొక్కుబడిగా విదిల్చారని జగన్ చెప్పుకొచ్చారు. ఉద్యోగుల్లో ఏ వర్గాన్ని చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. 53 వేల మందిని హెల్త్ సెక్టార్ లో నియమించామని సీఎం వివరించారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇచ్చిన ప్రభుత్వమని గుర్తు చేసారు. కారుణ్య నియామకాల్లోనూ పారదర్శకత పాటించామని చెప్పారు. పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచామన్నారు. ఎప్పుడూ నిజాయితీతోనే ఉద్యోగుల విషయం లో వ్యవహరిచామని సీఎం జగన్ వివరించారు.












Click it and Unblock the Notifications