నువ్వు దూసుకుపో, నీ వెనుక నేనున్నా - రాం కుమార్ రెడ్డికి సీఎం అభయం..!!
ముఖ్యమంత్రి జగన్ వెంకటగిరి పర్యటనలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. వెంకటగిరిలో ఐదవ విడత వైయస్ ఆర్ నేతన్న నేస్తం నిధులను లబ్దిదారుల ఖాతాల్లో సీఎం వైయస్ జగన్ జమ చేశారు. ఇదే సభ నుంచి వాలంటీర్ల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్ లక్ష్యంగా సీఎం జగన్ తన మాటల తూటాలు ప్రయోగించారు. వెంకటగిరి నియోజకవర్గంలో నేదురుమల్లి రాం కుమార్ రెడ్డికి ప్రజల సమక్షంలో కీలక సూచనలు చేసారు.
వెంకటగిరి సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షాల పైన విరుచుకుపడ్డారు. వాలంటీర్ల క్యారెక్టర్ ను కించ పర్చేలా మాట్లాడారంటూ పవన్ తీరును ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్, బాలయ్య, లోకేశ్ తీరును ఎండ గట్టారు. అదే సమయంలో తన ప్రభుత్వంలో చేసిన మంచిని వివరించారు. ప్రతీ కుటుంబానికి మంచి జరిగిందని భావిస్తే తనకు మద్దతుగా నిలవాలని సూచించారు. రానున్న రోజుల్లో అసత్యాలతో దుష్ప్రచారం మరింత తీవ్రతరం అవుతుందని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ ను ప్రధానంగా ఈ సభలో టార్గెట్ చేసారు. ఈ సభలో ఎమ్మెల్యే అనం స్థానంలో సమన్వయకర్తగా నియమితులైన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.

రాజకీయంగా మూలన పడిన నాయకుడికి వెంకటగిరి టికెట్ ఇస్తే ప్రజలు గెలిపించారని, ఆయన పార్టీ ని మోసం చేశాడు ఇటీవల టిడిపి యువనేత ఏడు రోజులు పాటు విహార యాత్ర చేశాడు, ఏడు మంది కూడా టీడీపీలో చేరలేదన్నారు. 80 వేల ఎకరాలు నీరు అందించే డక్కలి మండలం లోని అల్తూరు పాడు రిజర్వాయర్ పనులను ఆయన అడ్డుకున్నాడని, ఈ జలాశయ పనుల ను వెంటనే ప్రారంభించాలని సీఎంను కోరారు. రాం కుమార్ రెడ్డి అడిగిన అన్ని పనులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ప్రతీ ఇంటికి వెళ్లాలని ప్రజల సమక్షంలోనే సూచించారు. నియోజవకర్గంలోని ప్రతీ సచివాలయానికి రూ 25 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతీ ఇంటికి తిరగాలని నియోజకవర్గ ప్రజల సమక్షంలోనే ఆదేశించారు.
పోలేరమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్‌గా ముఖ్యమంత్రి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్ధిగా నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి పార్టీ అభ్యర్దిగా పోటీ చేయటం ఖాయమైంది. సీఎం తాజా నిర్ణయాలతో వెంకటగిరి నియోజకవర్గం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న విషయం స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications