రోజా కు మంత్రి పదవి పక్కా -"పెద్ది" సమస్య తొలిగినట్లే : నాని - అనిల్ కు దక్కేదేంటి..!!
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తన చిరకాల నిరీక్షణ ఫలించబోతోందా. జగన్ కేబినెట్ లో పని చేయాలనే లక్ష్యం నెరవేరబోతోందా. ఇప్పుడు వస్తున్న సంకేతాలు చెబుతన్నది ఏంటి. జగన్ కేబినెట్ లో ఉన్నవారిలో కంటిన్యూ అయ్యేదెవరు..కొత్తగా వచ్చే దెవరు. ఇప్పుడు కేబినెట్ విస్తరణ పైన అనేక రకాల చర్చలు తెర మీదకు వచ్చాయి. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత జగన్ తన తొలి కేబినెట్ ఏర్పాటు సమయంలో ఒక ప్రకటన చేసారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 90 శాతం మందిని రెండున్నారేళ్ల తరువాత మారుస్తామని చెప్పారు. కొత్త వారికి అవకాశం ఇస్తామని ప్రకటించారు.

కేబినెట్ విస్తరణలో కొత్త స్ట్రాటజీ
ఇక, ఇప్పటికే 26 నెలల పాలన పూర్తయింది. ఈ సమయంలో కేబినెట్ విస్తరణ ఎప్పుడనే చర్చ మొదలైంది. ఇప్పుడు..జగన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్ కేబినెట్ లో ప్రస్తుతం ఉన్న వారిని సీనియర్లతో సహా అందరినీ పక్కన పెట్టాలని భావిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. మార్పులు- చేర్పుల్లో భాగంగా కొందరిని తొలిగించి..మరి కొందరిని కంటిన్యూ చేస్తే కొత్త సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. దీంతో..సీనియర్లతో సహా పలువురికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

కొత్తగా ఆశావాహులు రేసులో..
అయితే, పార్టీ పునాది సమయం నుంచి ప్రతీ సందర్భంలో అండగా నిలుస్తూ..పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి, సీనియర్ నేత బొత్సా వంటి వారిని సైతం జగన్ మంత్రి పదవుల నుంచి తప్పించి..పార్టీ పదవుల్లో కీలకమైన బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. అదే జరిగితే...ఇక, పార్టీ కోసం పని చేసి తమకు గుర్తింపు ఇవ్వలేదనే భావనతో ఉన్న ముఖ్య నేతలకు తాజాగా జరిగే కేబినెట్ విస్తరణలో అవకాశం దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. అందులో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఫైర్ బ్రాండ్ రోజా.

రోజాకు లైన్ క్లియర్ అయినట్లేనా..
చిత్తూరు జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వటం తో అదే సామాజిక వర్గానికి చెందిన రోజాకు మంత్రి పదవి దక్కలేదు. ఇప్పుడు పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి తప్పించటం జరిగితే..రోజాకు లైన్ క్లియర్ అయినట్లే. అదే జిల్లా నుంచి భూమన-చెవిరెడ్డి లాంటి వారు సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వారు కేబినెట్ రేసులో ఉన్నారు. అయితే, మహిళా నేత కావటంతో పాటుగా..ఫైర్ బ్రాండ్ కావటంతో టార్గెట్ 2024 మిషన్ లో భాగంగా జగన్ ఏర్పాటు చేసుకొనే తన డ్రీం కేబినెట్ లో రోజాకు స్థానం దక్కటం దాదాపు ఖాయమే. తొలి మంత్రివర్గంలోనే రోజాకు స్థానం దక్కుతుందని భావించినా.. సామాజిక సమీకరణా ల వలన దక్కలేదు. ఆ తరువాత నామినేటెడ్ పదవుల్లో భాగంగా ఏపీఐఐసీ ఛైర్మన్ గా నియమించారు.

నామినేటెడ్ పదవి లేదు-కొడాలి నాని స్థానం ఎవరిది
తాజాగా, నామినేటెడ్ పదవుల భర్తీ సమయంలో ఎమ్మెల్యేలకు జోడు పదవులు వద్దని...రోజాకు ఆ నామినేటెడ్ పదవిని సైతం తప్పించారు. ఆ సమయంలో రోజాకు మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అయితే, ఇప్పుడు ఉన్న మంత్రులు అందరినీ తప్పిస్తే...కొడాలి నాని స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ మొదలైంది. కానీ, నాని స్థాయిలో టీడీపీని టార్గెట్ చేయటంలో కొడాలి నాని కి ఎవరూ సాటి రారు. దీంతో..ఆయన స్థానంలో ఎవరు ఆ వర్గం నుంచి కేబినెట్ లోకి వస్తారో ఆసక్తి కరమే.

మంత్రి స్థానంలో పార్ధసారధి పేరు..
ఇక, నాని తరహాలో టీడీపీ పైన విరుచుకుపడే మరో నేత మంత్రి అనిల్. ఇక, మంత్రి అనిల్ ను తప్పిస్తే ఆ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన క్రిష్ణా జిల్లాకు చెందిన పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన సైతం టీడీపీని కార్నర్ చేయటంలో ముందుంటారు. దీంతో..పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న రోజా కు ఎంట్రీ, అదే విధంగా ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొడాలి నాని - అనిల్ భవిష్యత్ లో ఏ పదవుల్లో కొనసాగుతారనే ఆసక్తి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications