ఉద్యోగుల పీఆర్సీ ప్రకటన - ఫిట్ మెంట్ 23.39 శాతం ఖరారు: రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు..!!
ఎట్టకేలకు ఏపీ ఉద్యోగులకు పీఆర్సీ ఖరారైంది. అనేక తర్జన భర్జనల తరువాత సీఎం జగన్ ఉద్యోగులకు 23.39 శాతం ఫిట్ మెంట్ ఖరారు చేస్తూ నిర్ణయం ప్రకటించారు. 11 వేతన సంఘ సిఫార్సులు అమలు చేయాలంటూ ఉద్యోగులు కొద్ది కాలంగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్నారు. మధ్యలో కొన్ని రోజులు నిరసనలు చేసారు. అయితే, ఆర్దిక మంత్రి బుగ్గన.. అధికారులు పలు విడతలు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించారు. వారి డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. వారి డిమాండ్ల పైన ఎంత వరకు అనుకూలంగా చేయగలమనే అంశం పైన చర్చలు చేసారు. చిరవకు నిర్ణయం ప్రకటించారు. అదే సమయంలో అనూహ్యంగా ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల నుంచి పీఆర్సీ అమలు కానుంది. దీని ద్వారా ప్రభుత్వం పైన అదనంగా 10,247 కోట్ల మేర భారం పడనుంది.

అనేక చర్చలు..సమావేశాల తరువాత..
అయితే, ఎన్ని సార్లు సమావేశాలు జరిగినా.. ఫలితం లేకపోవటంతో తాము ముఖ్యమంత్రి వద్ద సమావేశం అవుతామని.. సీఎం వద్దే ఫైనల్ నిర్ణయం వస్తుందంటూ ఉద్యోగ సంఘ నేతలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో గురువారం సీఎం జగన్ వద్ద ఉద్యోగ సంఘాల నేతల సమావేశం జరిగింది. సుదీర్ఘంగా సాగిన ఆ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మరో సారి రాష్ట్రంలోని ఆర్దిక కష్టాలను వివరించారు. ప్రభుత్వం భారీ భారం మోపవద్దని సూచించారు. తాను సైతం ఉద్యోగుల కుటుంబ సభ్యుడిగా నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. రెండు లేదా మూడు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. అయితే, 23.39 శాతం ఫిట్ మెంట్ ను ఖరారు చేస్తూ.. 62 ఏళ్ల కు ఉద్యోగ విరమణ వయసు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

చెప్పిన సమయం కంటే ముందుగా
కానీ, మరింత సమయం తీసుకోకుండా.. వెంటనే పీఆర్సీ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారు. అందులో భాగంగా ఉద్యోగులతో సమావేశం తరువాత వరుసగా పీఆర్సీ అంశాల పైనే మంత్రులు.. అధికారులతో వరుస సమీక్షలు చేసారు. ఈ రోజే పీఆర్సీ ఫైనల్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలకు సమాచారం ఇచ్చారు. వారితో సమావేశమైన సీఎం జగన్ చివరకు శాతం ఫిట్ మెంట్ ఖరారు చేస్తూ నిర్ణయం ప్రకటించారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్ కంటే ఎక్కువగా ఫిట్ మెంట్ ఉండాలంటూ సీఎంతో జరిగిన సమావేశంలోనూ డిమాండ్ చేసారు.

ఉద్యోగులు అంగీకరించినట్లేనా
సచివాలయ ఉద్యోగ సంఘం 34 శాతం ఫిట్ మెంట్ డిమాండ్ చేసింది. అయితే, అన్ని పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న తరువాత సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి కానుగా ఉద్యోగులకు ఈ నిర్ణయం ప్రకటించారు. అదే విధంగా ప్రధానమైన ఫిట్ మెంట్ పైన నిర్ణయం రావటంతో..మిగిలిన డిమాండ్ల పైన సీఎం సానుకూలంగా స్పందించారు. వీటి పైన అధికారుల స్థాయిలో ..సానుకూల నిర్ణయాలు తీసుకుంటారనే సంకేతాలు సీఎం నుంచి అందాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
Recommended Video

జూన్ 30 లోగా సీపీఎస్ పై నిర్ణయం..
23 శాతం ఫిట్ మెంట్ గా ప్రకటించిన సీఎం జగన్.. డీఏలు సైతం వెంటనే క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ నాటికి బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. మరో కీలకమైన అంశం సీపీఎస్ స్కీం కు సంబంధించి సీఎం స్పష్టత ఇచ్చారు. జూన్ 30వ తేదీ లోగా సీపీఎస్ పైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కారణంగా ఫిట్ మెంట్ పైన నిరాశ ఉన్నా.. పెండింగ్ డీఏలు విడుదల చేస్తున్నందున తాము అంచనా వేసిన దానికి దగ్గరగానే వేతనాలు వస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అదే విధంగా పదవీ విరమణ వయసు పెంపు పైన ఎటువంటి డిమాండ్ లేకపోయినా.. సీఎం జగన్ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాలకు సంబంధించి ఉద్యోగ సంఘాల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications