నేడే రైతుల ఖాతాల్లో ఆ నిధులు జమ; బటన్ నొక్కనున్న సీఎం జగన్ !!
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. వైయస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం మూడో విడత నిధులను రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు. నేడు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాలలో డబ్బులను జమ చేస్తారు.
మూడో విడత రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులు మొత్తం నేడు రైతుల బ్యాంకు ఖాతాలలోకి 1078. 36 కోట్లను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు వైయస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ యోజన పథకం కింద 13,500 రూపాయల చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాయి.

ఇందులో కేంద్రం వాటా 6 వేల రూపాయలు కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాటా 7500 రూపాయలు ఇక ఇది మాత్రమే కాక తాజాగా ఇస్తున్న 2000 రూపాయల సహాయంతో కలిపి ఒక్కో రైతుకు వైసిపి ప్రభుత్వం 57 నెలలలో 67 వేల 500 రూపాయలు చొప్పున అందించినట్టు సమాచారం.
రైతు సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని చెబుతూ సీఎం జగన్ వైయస్సార్ సున్నా వడ్డీ రాయితీని కూడా రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు. 2021 - 22 రబీ సీజన్లోనూ, 2022 ఖరీఫ్ సీజన్లోనూ రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన వారికి 215. 98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును సీఎం జగన్మోహన్ రెడ్డి 10 లక్షల 78 వేల 615 మంది రైతుల ఖాతాలలో నేడు జమ చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 64.37 లక్షల రైతుల కుటుంబాలకు రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ కింద మొత్తం 1294. 34 కోట్ల సహాయం అందించనున్నారు. తాము రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులను ఉద్దేశించి చెప్పనున్నారు.












Click it and Unblock the Notifications