విశాఖ అభివృద్ధి ఏపీకి కీలకం - ప్రధానికి సీఎం జగన్ లేఖ : షరతులు లేకుండా చూడాలంటూ..!!
ఏపీ ఆర్థికాభివృద్ధిలో విశాఖ కీలకమని సీఎం జగన్ ప్రధాని మోదీకి నివేదించారు. రాష్ట్రానికి సంబంధించిన ఆర్దిక ఎదుగదలతో పాటుగా పర్యాటకాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విశాఖ మరింత ఎదిగేలా సహకరించాలని ఆయన కోరారు. ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాసారు. అందులో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి షరతులు లేని అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈస్టర్న్ నావల్ కమాండ్ ఐఎన్‌ఎస్ డేగాకు చెందిన నేవీ బేస్ నుంచి పౌర విమాన సర్వీసులు అధిక సంఖ్యలో నడిపేందుకు ఇబ్బందులు తలెత్తడంతో భోగాపురం వద్ద నూతన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించ తలపెట్టినట్లు లేఖలో ప్రస్తావించారు.

ప్రధానితో సహా కేంద్ర మంత్రులకు
2016లో షరతులతో ఇచ్చిన నిరభ్యంతర పత్రం గడువు ముగిసిపోయినందున తాజాగా ఎటువంటి నిబంధనలు, షరతులు లేకుండా ఎన్‌వోసీ జారీ చేయాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కూడా ముఖ్యమంత్రి వేర్వేరుగా లేఖలు రాశారు. విభజన చట్టం ప్రకారం విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను రాష్ట్ర విభజన తేదీ నుంచి ఆరు నెలల్లోగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలన్న అంశాలను కేంద్రం పరిశీలించాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశంగా సీఎం పేర్కొన్నారు. ఈ 3 ఎయిర్‌పోర్టుల నుంచి విమాన సర్వీసులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్ధించారు.

విశాఖలో కీలకంగా
రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పర్యాటకాభివృద్ధిలో విశాఖ పాలు పంచుకునేలా విమానాశ్రయం కీలకపాత్ర పోషిస్తోందని వివరించారు. మరింత వృద్ధిరేటు సాధించి విశాఖ హబ్‌గా ఎదిగేలా పౌర విమాన సర్వీసులను నడపాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. విశాఖ విమానాశ్రయానికి మూడు వైపులా కొండలున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా పౌర విమానాలను కేవలం ఒక దిశలో మాత్రమే టేకాఫ్ చేసేందుకు అనుమతిస్తున్నారని ప్రధానికి వివరించారు. దీనివల్ల గంటకు 10 విమాన సర్వీసులకు మించి నడిపే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. రక్షణ రంగం, పౌర విమానయాన అవసరాలను ప్రస్తుతం ఇది తీరుస్తున్నా భవిష్యత్తులో రాకపోకలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వివరించారు.

షరతులు లేకుండా మంజూరు చేయండి
ఒకవైపు రక్షణ రంగ కార్యకలాపాలు మరోవైపు విశాఖలో పర్యాటకం అభివృద్ధి చెందుతుండటంతో పౌర, రక్షణ అవసరాలకు వినియోగిస్తున్న ఈ ఎయిర్‌పోర్టులో రద్దీ పెరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టును నిర్వహిస్తున్న ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిహారం చెల్లించాలని కోరింది. పౌరవిమానయాన శాఖ ఇచ్చిన నిరభ్యంతర లేఖ కాల పరిమితి ఇప్పటికే ముగిసిపోయిది. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి పీపీపీ విధానంలో భాగస్వామ్య కంపెనీని ఎంపిక చేసినప్పటికీ కొత్తగా సైట్ క్లియరెన్స్, ఎన్‌వోసీ ఇవ్వకపోవడంతో పనులు చేపట్టలేకపోతున్నామన్నారు.

రక్షణ పరంగా వ్యూహాత్మకం
దీని ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి పౌర విమానయాన శాఖ నిరభ్యంతర పత్రం జారీ చేసేలా చూడాలని కోరుతున్నామని లేఖలో సీఎం కోరారు. ఇదే సమయంలో.. తూర్పు తీర రక్షణలో ఐఎన్‌ఎస్ డేగా చాలా కీలకమని, రక్షణపరంగా వ్యూహాత్మకమని, రక్షణ కార్యకలాపాలకు మినహా పౌర విమాన సర్వీసులకు విశాఖ అనువు కాదని స్పష్టం చేశారు. నేవీ ఎయిర్ బేస్‌ను భోగాపురం తరలించాలనే ప్రతిపాదన ఆర్థికంగా కూడా ఆచరణ యోగ్యం కాదు. దీంతో పౌర విమాన సర్వీసులను తరలించాలని నిర్ణయించామని పూర్తి వివరాలను ప్రధానికి రాసిన లేఖలో సీఎం వివరించారు.












Click it and Unblock the Notifications