ఆలీకి సీటుపై సీఎం జగన్ ఆలోచన మారిందా..!?
ఏపీ ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ ఇంఛార్జ్ ల మార్పుల కసరత్తు తుది దశకు చేరుకుది. సిట్టింగ్ ఎంపీల్లో పలువురిని సీఎం జగన్ మార్చారు. పలువురిని ఎమ్మెల్యేలుగా పోటీకి ఖరారు చేసారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సమయంలోనే సినీ నటుడు ఆలీ పోటీ వ్యవహారం పైన పార్టీలో ఆసక్తి కర చర్చ సాగుతోంది. పోటీకి సిద్దమని ఆలీ ప్రకటించారు. మరి.. సీఎం జగన్ నిర్ణయం ఏంటి. ఆలీకి ఏ స్థానం ఇవ్వబోతున్నారు.
మార్పులు - చేర్పులు
సీఎం జగన్ ఎంపీ, ఎమ్మెల్యే కసరత్తు పైన ఆసక్తి కర నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటి వరకు ఏడు జాబితాల్లో అభ్యర్దుల మార్పును ఖరారు చేసారు. పలువురు ఎంపీలను మార్చారు. కొందరు ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్దులగా ప్రకటించారు. ఈ సమయంలోనే సినీ నటుడు ఆలీకి సీటు వ్యవహారం పైన చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పని చేసిన ఆలీకి ప్రస్తుతం ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించింది. పార్టీ నిర్వహించిన సామాజిక బస్సు యాత్రల్లో ఆలీ పాల్గొన్నారు. ఆలీకి రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం సాగినా..ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు ఎన్నికల్లో ఆయనకు ఎంపీగా సీటు ఖాయమని పార్టీలో ప్రచారం సాగుతోంది.

పోటీకి ఆలీ సిద్దం
తాను పోటీకి సిద్దమని ఆలీ స్పష్టం చేసారు. అధిష్టానం ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఎక్కడి నుండైనా పోటీకి సిద్ధమని ప్రకటించారు. గుంటూరు నంద్యాల లేక రాజమండ్రి వేచి చూడాలని ఆలీ వ్యాఖ్యానించారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసారు. రాప్తాడు సిద్ధం సభ చూసిన తర్వాత వైసిపి పట్ల ప్రజాభిమానం ఏ మాత్రం తగ్గలేదని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో వైసిపి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. ఇదే సమయంలో ఎంపీగానే ఆలీ పోటీ చేయటానికి సిద్దంగా ఉన్నారనే విషయం స్పష్టం అవుతోంది. వచ్చే వారం సీఎం జగన్ నేరుగా ఆలీతో చర్చించి పోటీ అంశం పైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే, ఆలీని మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బరిలోకి దింపాలనేది సీఎం ఆలోచనగా చెబుతున్నారు.
జగన్ నిర్ణయం ఏంటి
కొద్ది రోజులుగా ఆలీ పేరు నంద్యాల పార్లమెంట్ కు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే, నంద్యాలతో పాటుగా ప్రస్తుతం కడప ఎంపీగా పోటీ చేయించే అంశం పైన ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. అక్కడ ప్రస్తుత ఎంపీ అవినాశ్ రెడ్డిని ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది. కడప ఎమ్మెల్యేగా ఉన్న అంజాద్ బాష స్థానం ఆ సీటు రెడ్డి/ బలిజ వర్గాలకు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, ఆలీ / అంజాద్ పాషా ల్లో ఒకరికి ఎంపీగా అవకాశం ఇస్తారనే అభిప్రాయం జిల్లా పార్టీ నేతల్లో వినిపిస్తోంది. కడప జిల్లాలోనూ సిట్టింగ్ స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో..ఆలీకి సీటు ఖాయమని చెబుతున్నా...సీఎం జగన్ తుది నిర్ణయం పైన ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications