సీఎం రమేష్ పై జగన్ అభ్యర్ది ఫిక్స్ - కలిసొచ్చేదెవరికి..!!
ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారుతోంది. మూడు పార్టీల ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జనసేన అభ్యర్దుల పైన స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీ ఇప్పటికే అభ్యర్దులను ఖరారు చేసింది. అనకాపల్లి ఎంపీ స్థానం మాత్రం ఖరారు చేయలేదు. ఎన్డీఏ కూటమి నుంచి ఈ సీటు బీజేపీకి కేటాయించారు. ఇక్కడ నుంచి సీఎం రమేష్, జీవీఎల్ సీటు ఆశిస్తున్నారు. సీఎం రమేష్ పోటీ చేస్తే వైసీపీ నుంచి ఎవరిని బరిలోకి దించాలనే అంశం పైన జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు.
సీట్ల కసరత్తు
పొత్తుల్లో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాలు ఖరారయ్యాయి. అయితే, ఏ స్థానాలనేది ఇంకా ఖరారు కాలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ మాత్రం ఇప్పటికే బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాల పైన స్పష్టత ఇచ్చినట్లు చెబుతోంది. బీజేపీ ఆ స్థానాలకు అధికారికంగా ఆమోదం తెలిపితే తమ ఎంపీల అభ్యర్దులను ప్రకటించేందకు చంద్రబాబు ,పవన్ సిద్దమయ్యారు.

ఈ సమయంలో విశాఖ సీటును బీజేపీ నేతలు కోరుతున్నారు. అందుకు చంద్రబాబు సిద్దంగా లేరు. ఫలితంగా అనకాపల్లి స్థానం బీజేపీకి కేటాయించారు. అక్కడ నుంచి పార్టీ నేతలు జీవీఎల్ నర్సింహారావు, సీఎం రమేష్ పోటీ పడుతున్నారు. దాదాపు గా సీఎం రమేష్ కు ఖాయమవుతుందనే ప్రచారం సాగుతోంది.
బీజేపీ కసరత్తు
మొత్తం 25 ఎంపీ స్థానల్లో అనకాపల్లి మినహా అన్ని స్థానాలకు వైసీపీ తమ అభ్యర్దులను ప్రకటించింది. సీఎం రమేష్ సొంత జిల్లా కడప. చంద్రబాబుకు అత్యంత సన్నిహిత నేగా పేరుంది. బీసీ, కాపు ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఈ నియోజకవర్గం తొలుత జనసేనకు కేటాయించారు. అక్కడ నుంచి మెగా బ్రదర్ నాగబాబును పోటీ చేయించాలని భావించారు. బీజేపీతో పొత్తు చర్చల్లో భాగంగా జనసేన ఈ సీటును కమలం పార్టీకి వదలేసింది. ఇప్పుడు అక్కడ అభ్యర్దిని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఇటు వైసీపీ నుంచి బీసీ అభ్యర్దినే బరిలోకి దించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. గతంలో నగరంలోని ఒక నియోజకవర్గం లో ఎమ్మెల్యేగా పని చేసి..తాజాగా సీటు రాని కారణంగా టీడీపీకి రాజీనామా చేసిన బీసీ నేత వైసీపీతో టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. ఆయనో పాటుగా మరో ఇద్దరి పేర్లను పరిశీలన చేస్తున్నారు. వీరిలో ఒక మహిళా నేత పేరు వినిపిస్తోంది.
వైసీపీ అభ్యర్దిగా
మాడుగుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడును అనకాపల్లి ఎంపీగా పోటీకి దింపితే ఎలా ఉంటుందని జగన్ సర్వే చేయిస్తున్నారు. అదే సమయంలో ముత్యాల నాయుడును ఎంపీగా పోటీ చేయిస్తే మాడుగల సీటును ఆయన కుమార్తె ఈర్ల అనురాధకు కేటాయించే అవకాశం ఉంది.
ఇదే సమయంలో పార్టీ బీసీ సెల్ కార్యదర్శిగా పని చేస్తున్న గవర సామాజిక వర్గానికి చెందిన మరో నేత కాశీ విశ్వనాధం పేరు రేసులో ఉంది. అనకాపల్లికి చెందిన విశ్వనాధం ...ప్రస్తుతం నర్సీపట్నం పార్టీ పరిశీలకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో, ఎన్డీఏ కూటమి నుంచి అభ్యర్ది పేరు అధికారికంగా ప్రకటన చేసిన వెంటనే వైసీపీ తమ అభ్యర్దిని ప్రకటించేలా నిర్ణయించారు. దీంతో, అనకాపల్లి పోరు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications