ఈ మార్పుల ఫలితాలు త్వరలో చూస్తారు - సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ మరోసారి ప్రతిపక్షాల విమర్శలపైన ఘాటుగా స్పందించారు. తాను మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ మద్దతు మీడియా పైన ఫైర్ అయ్యారు. చంద్రబాబు హామీ ఇస్తున్న ఆరు గ్యారెంటీల పైన జగన్ స్పందించారు. ఎవరైతే మీకు మంచి చేశారో..ఆ మంచి చేసిన వ్యక్తులను గుర్తుపెట్టుకోండని సూచించారు. ప్రతీ ఇంటికి మంచి జరిగితేనే తనకు అండగా నిలవాలని సూచించారు. రాజకీయంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు.
ఇదే ఆకాంక్ష:మన పిల్లలు ప్రపంచంలోనే దిబెస్ట్‌గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే. విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారు. విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారు. పేద విద్యార్థులపై విషం కక్కొద్దని చెబుతున్నానన్నారు, ఒక పత్రికను వేదిక పైన చూపిస్తూ మాట్లాడిన జగన్..సీరియస్ అయ్యారు. పేదలకు మంచి చేస్తుంటే మీకెందుకు ఈ కడుపుమంట అని ప్రశ్నించారు. దిక్కుమాలిన రాజకీయాలతో యుద్ధం చేస్తున్నాం అంటూ సీఎం వైయస్ జగన్ ధ్వజమెత్తారు. గిట్టని వాళ్లు వైయస్ జగన్ దుబారా చేస్తున్నాడంటూ మాట్లాడుతున్నారని చెప్పారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు ఈ స్థాయిలో ఖర్చుచేయలేదని వివరించారు.

భావితరాల కోసమే:ఖర్చు చేసే ప్రతీ రూపాయి భావితరాల కోసమే అని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేపట్టింది. రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ గల 4,34,185 ట్యాబ్స్‌ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి సీఎం వైయస్ జగన్ ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభించారు. మన రాష్ట్రంలో ఉన్న పిల్లలు పోటీ ప్రపంచంతో గెలవాలన్నారు. అందుకోసం ఈ 55 నెలలు ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు పడ్డాయని వివరించారు. అందులో భాగంగానే వరుసగా రెండో ఏడాది ఈ రోజు ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే ప్రతి మండలాన్ని సందర్శించేలా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు ఆరు గ్యారెంటీలపై:రాబోయే రోజుల్లో పిల్లలు ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇతర విదేశీ భాషలు నేర్చుకునేలా డూయేలింగ్ యాప్ అప్‌లోడ్ చేయిస్తున్నామన్నారు. ఈ ట్యాబ్‌లు నిరంతరం పిల్లలకు తోడుగా ఉండే ట్యూటర్‌గా అండగా నిలబడుతుంది. వారి ప్రయాణంలో అన్ని రకాలుగా పిల్లలకు సహకారం అందుతుందని జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై, మంచి చేస్తున్న ప్రభుత్వంపై కొందరు బురద జల్లుతున్నారన్నారు. మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం చదువులు చదవాలి, పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం బడులకు వెళ్లకూడదు, ఇంగ్లీష్ చదవకూడదా అని ప్రశ్నించారు. రాష్ట్రమంతా అప్పులపాలు అయిందని రాస్తారు. మరోవైపు చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి ఆరు గ్యారంటీలు చెబితే పతాక శీర్షికలో రాస్తారని మండిపడ్డారు. వారి ఇచ్చేవి చూస్తే జగన్ ఇచ్చేదానికన్నా వారు చెప్పేది మూడింతలు. ఎంత మోసం చేస్తున్నారో ఆలోచన చేయండని సీఎం జగన్ సూచించారు.












Click it and Unblock the Notifications