రేపు కర్నూలు జిల్లాకు సీఎం జగన్ - మొహరించిన కాంగ్రెస్ నేతలు..!!
ముఖ్యమంత్రి జగన్ సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఏపీ కాంగ్రెస్ నేతలంతా కర్నూలు లోనే మొహరించారు. ముఖ్యమంత్రి ఉదయం 9.00 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరనున్న సీఎం, 10.15 గంటలకు ఆళ్ళగడ్డ చేరుకుంటారు. 10.45 - 12.10 గంటలకు వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు, అనంతరం వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ రెండో విడత నగదు బదిలీని బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. మధ్యాహ్నం 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఆళ్లగడ్డ - నంద్యాలలో కొద్ది రోజులుగా భూమా వారసుల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఆళ్లగడ్డ లో జరిగే కార్యక్రమం కావటంతో గంగుల కుటుంబం దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక, మరో వైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు రేపు (సోమవారం) పోలింగ్ జరగనుంది. గాంధీ కుటుంబేతర అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్దమైంది. అధ్యక్ష రేసులో మల్లిఖార్జున ఖర్గే - శశి థరూర్ పోటీ పడుతున్నారు. ఇందు కోసం దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీ లో కాంగ్రెస్ డెలిగేట్లు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 350 మంది పీసీసీ డెలిగేట్లు ఉన్నారు. వారంతా కర్నూలుకు తరలి రానున్నారు. 22 ఏళ్ల తర్వాత ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి.

ఏఐసీసీ అధ్యక్ష పదవికి మల్లి ఖార్జున ఖర్గే.. శశి థరూర్ పోటీపడుతున్నారు. ఓటింగ్ సందర్భంగా భారత్ జోడో యాత్రకు సోమవారం విరామం ప్రకటించారు. 19వ తేదీన కౌంటింగ్ జరిగి.. అదే రోజు ఫలితం ప్రకటించనున్నారు. ఇదే జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు భారత్ జోడో యాత్రలో పొల్గొంటున్నారు. దీంతో..జిల్లాలో కాంగ్రెస్ నేతల సందడి పెరిగింది. ఇప్పటికే రాహుల్ అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఒక రోజు యాత్ర నిర్వహించారు. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి పీసీసీ డెలిగేట్ గా మెగాస్టార్ చిరంజీవికి ఓటు వేసే హక్కు ఉన్నా..ఆయన హాజరయ్యే అవకాశాలు కనిపించటం లేదు. ఆయన కాంగ్రెస్ కు అధికారికంగా రాజీనామా చేయకపోయినా.. రాజకీయాలకు మాత్రం పూర్తిగా దూరంగా ఉంటున్నారు.












Click it and Unblock the Notifications