నంద్యాలకు సీఎం జగన్ - బాధిత కుటుంబానికి అండగా..!!
ముఖ్యమంత్రి జగన్ నంద్యాల జిల్లాకు వెళ్తున్నారు. అనారోగ్యంతో మరణించిన ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించనున్నారు. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి బుధవారం కన్నుమూసారు. ఆయన కొంత కాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నారు. రెండు రోజులుగా ఆయన వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం కన్నుమూశారు.
శుక్రవారం అవుకులో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వ్యవహరించిన చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఆయన రెండో కుమారుడైన భగీరథరెడ్డికి ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం లభించింది. భగీరథరెడ్డి 2003 నుంచి 2009 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2007-08 మధ్య ఆలిండియా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. 2019లో తండ్రితో కలిసి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. భగీరథరెడ్డి అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ రోజు నంద్యాల జిల్లాలో సీఎం జగన్ భగీరధ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతూ మరణించారు. ఆ సమయంలో ఆ కుటుంబానికి సీఎం జగన్ ధైర్యం చెప్పారు. అప్పుడే ఆయన కుమారుడికి ఎమ్మెల్సీ ఖరారు చేసారు. తక్కువ కాలంలోనే తండ్రి - కుమారుడు అనారోగ్యం కారణంగా మరణించటంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. ఆ కుటుంబానికి సీఎం జగన్ ఓదార్పు ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications