ఎమ్మెల్యే అభ్యర్దులుగా వైసీపీ ఎంపీలు - రెడీ అవుతున్న సీఎం జగన్ 2024 టీం..!!
CM Jagan: వై నాట్ 175. వచ్చే ఎన్నికల కోసం సీఎం జగన్ నినాదం ఇది. ఇందు కోసం ముందస్తుగానే ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా పార్టీ నేతలతో..ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఎంపీలు - ఎమ్మెల్యే పని తీరు పైన సర్వేల ద్వారా భిన్న కోణాల్లో సమాచారం సేకరిస్తున్నారు. ముందస్తుగా నియోజకవర్గాల్లో అభ్యర్దుల ఖరారు పైన ఫోకస్ పెట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్దుల మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రస్తుతం కొందరు సిటింగ్ ఎంపీలను వచ్చే ఎన్నికల్లో కొందరిని ఎమ్మెల్యేలుగా పంపే విధంగా నిర్ణయాలు జరుగుతున్నాయి.

టార్గెట్ 175 - పనితీరే ప్రామాణికం
ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలనేది సీఎం జగన్ లక్ష్యం. ఈ సారి అధికారంలోకి వస్తే మరో 30 ఏళ్లు వైసీపీదే అధికారమని సీఎం జగన్ ధీమా. ఈ ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలను సీఎం జగన్ చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని వైసీపీ అంచనా వేస్తోంది. దీంతో, అభ్యర్దుల ఎంపిక పైన ముందస్తుగానే కసరత్తు చేస్తున్నారు. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తిరిగి ఖాయంగా గెలిచే అవకాశం ఉన్నవారిని మినహాయించి..మిగిలిన వారి విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ముందుగానే కొందరికి సంకేతాలు ఇస్తున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్దులను ఖరారు చేస్తానని ఇప్పటికే సీఎం స్పష్టం చేసారు. దీంతో, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకం అయ్యేందుకు శ్రమిస్తున్నారు. ఈ సమయంలో నియోజకవర్గంలో సమన్వయకర్తలను నియమించి న సీఎం..ప్రతీ నియోజకవర్గంలో గెలుపు దిశగా పని చేయాలని నిర్దేశిస్తున్నారు.
ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్దులుగా..
2019 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్దుల విషయంలో సీఎం జగన్ కొత్త ప్రయోగాలు చేసారు. పక్కా సోషల్ ఇంజనీరింగ్ ఫాలో అయ్యారు. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వారిలో కొందరిని ఎమ్మెల్యేలుగా పంపటం ద్వారా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయనే నివేదికలు ఆధారంగా కొత్త నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా.. నర్సరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయులను గుంటూరు పశ్చిమం నుంచి అసెంబ్లీకి పంపే అవకాశం కనిపిస్తోంది. రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ను 2019లో పార్టీ కోల్పోయిన రాజమండ్రి అర్బన్ నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను సొంత నియోజకవర్గం కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి పోటీకి దింపే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ను అదే జిల్లాలోని కల్యాణ దుర్గం నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. అమలాపురం ఎంపీ చింతా అనురాధ వచ్చే ఎన్నికల్లో పీ గన్నవరం నుంచి పోటీకి దిగే అవకాశాలు ఉన్నట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది.
టీడీపీ -జనసేన పొత్తుతో కొత్త సమీకరణాలు
టీడీపీ -జనసేన పొత్తు ఖాయమని వైసీపీ అంచనా వేస్తోంది. దీంతో..సామాజిక - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా అభ్యర్దుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గోదావరి జిల్లాల్లో కొన్నినియోజకవర్గాల పైన సీఎం ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. పిఠాపురం నుంచి ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలోకి దింపే అవకాశం ఉంది.అక్కడ 2009లో గీత పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ను నెల్లూరు ఎంపీగా లోక్ సభకు పోటీ చేయించే అవకాశం ఉంది. ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా పంపే ఛాన్స్ ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. అయితే, నెల్లూరులో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు పార్టీలోని అంతర్గత విభేదాలు..సమస్యల కారణంగా కొన్ని మార్పులు తప్పవని చెబుతున్నారు. దీంతో, జగన్ తుది జాబితా ఎలా ఉంటుందనే ఉత్కంఠ ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీల్లోనూ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications