వారికి బాసట.. జగనన్న చేదోడు నిధులు విడుదల చేసిన సీఎం జగన్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నా, సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం సంక్షేమంలో దూసుకుపోతున్నారు. ప్రతిపక్షాల విమర్శలను, ఆందోళనలు పట్టించుకోకుండా ప్రజా సంక్షేమం కోసం సరికొత్త పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. తన సంక్షేమ మంత్రమే తనను ముందుకు నడిపిస్తుందని, వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తుందని సీఎం జగన్ బలంగా నమ్ముతున్నారు.
తాజాగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న చేదోడు సాయాన్ని నేడు ఎమ్మిగనూరులో బటన్ నొక్కి ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీలో వై డబ్ల్యూ సి ఎస్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో ఈ పథకం నిధులను సీఎం జగన్ తన చేతుల మీదుగా విడుదల చేశారు. జగనన్న చేదోడు పథకం కింద 3,25,020 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.325.02 కోట్లు జమ చేశారు సీఎం జగన్.

కంప్యూటర్ బటన్ నొక్కి అర్హులైన రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు రూ.10 వేల చొప్పున జగనన్న చేదోడు సాయం అందించారు. ఈ విడతలో 1,04,551 మంది రజకులకు రూ.104.55 కోట్లు, 1,80,656 మంది టైలర్లకు రూ.180.66 కోట్లు, 39,813 మంది నాయీ బ్రాహ్మణులకు రూ.39.81 కోట్లు జమ చేశారు.
షాపులు ఉన్న రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా పదివేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని జగనన్నఅందిస్తూ వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు జగనన్న చేదోడులో వైయస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం 1252.52 కోట్లు. ఈ సంవత్సరం జగనన్న చేదోడు తో కలిపి మొత్తం ఇప్పటివరకు 40 వేల రూపాయల వరకు లబ్దిదారులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించారు.
లంచాలకు, వివక్షకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయాలలో అర్హుల జాబితాను ప్రదర్శించి సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయడం జరిగింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి జగనన్న చేదోడు అందుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications