అసౌకర్యానికి చింతిస్తున్నా - విచారణకు డీజీపీకి ఆదేశాలు : సీఎం జగన్ సీరియస్..!!
ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నట్లు చెప్పారు. తన పర్యటన కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేయటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ ఘటన పైన విచారణ చేయాలని డీజీపీని ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్ శారదా పీఠంలో కార్యక్రమాలకు హాజరయ్యేందుకు బుధవారం విశాఖ వెళ్లారు. ఆ సమయంలో సీఎం పర్యటన పేరుతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేసారు. విశాఖపట్నం విమానాశ్రయంలో దిగి, అక్కడి నుంచి ఎన్‌ఏడీ జంక్షన్ మీదుగా రోడ్డు మార్గంలో విశాఖ శారదా పీఠానికి జగన్ వెళ్లారు.

సీఎం పర్యటన వేళ ఆంక్షలు
అక్కడ పూజలు నిర్వహించి తిరిగి మధ్యాహ్నం 3.35 గంటలకు బయలుదేరి అదే మార్గంలో విమానాశ్రయానికి వెళ్లారు. సీఎం విమానాశ్రయానికి వస్తున్నారంటూ మధ్యాహ్నం 2.30 గంటల నుంచే... ఎక్కడి వాహనాలు అక్కడ ఆపివేశారు. గాజువాక నుంచి వచ్చే వాహనాలను జాతీయ రహదారిపై షీలానగర్ వద్ద, నగరం నుంచి వచ్చే వాహనాలను ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద, అరకులోయ నుంచి వచ్చే వాహనాలను పెందుర్తి జంక్షన్ వద్ద నిలిపేశారు. సుమారు గంటపాటు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు నానా ఇక్కట్లు పడ్డారు.
ప్రజల అసహనం - ఆగ్రహం
సాయంత్రం 4 గంటలకు విజయవాడ, హైదరాబాద్‌కు విమానాల్లో వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యమంత్రి శారదా పీఠానికి వస్తున్నారంటూ పెందుర్తి నుంచి వేపగుంట వరకు... 2 కిలోమీటర్ల పొడవునా దుకాణాలన్నీ ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకూ మూసివేయించారు. కొందరు సహనం నశించి పోలీసులను నిలదీసారు. విశాఖ నగర ప్రజలు సీఎం పర్యటన వేళ అసౌకర్యానికి గురి కావటం.. ఇబ్బందులు పడటం పైన మీడియాలో పెద్ద ఎత్తున కధనాలు వచ్చాయి. దీంతో..సీఎం జగన్ స్పందించారు.
Recommended Video

సీఎం సీరియస్ - చింతిస్తున్నా
గంటల తరబడి ట్రాఫిక్ ఆంక్షలపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. అధికారుల పైన సీరియస్ అయ్యారు. గంటలతరబడి ట్రాఫిక్ ఎందుకు నిలిపేశారంటూ అధికారులను ప్రశ్నించారు. ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేశారంటూ ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు సీఎం చింతించారు. ఈ మొత్తం వ్యవహారం పైన డీజీపీ విచారణకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications