ఎన్నికల వేళ కేసీఆర్ తో సీఎం జగన్ కీలక భేటీ..!!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల రాజకీయం మారుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సీఎం జగన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. అభ్యర్దుల ఎంపిక తుది దశకు చేరుకుంది. కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్దం అవుతున్నారు. అటు షర్మిల కాంగ్రెస్ నేతగా ఏపీలో క్రియాశీలకంగా మారుతున్నారు. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. బీజేపీ నిర్ణయం వెల్లడి కావాల్సి ఉంది. ఈ సమయంలో సీఎం జగన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ రేపు (గురువారం) హైదరాబాద్ వెళ్లనున్నారు. నేరుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లనున్నారు. గత నెలలో కేసీఆర్ తన ఫాం హౌస్ లో పడటంతో తుంటి ఎముకకు గాయం అయింది. వైద్యులు సర్జరీ చేసి సరి చేసారు. దాదాపు వారం రోజులు ఆస్పత్రిలోనే ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ తో పాటుగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించారు. ఆ సమయంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శకు వెళ్లాలని భావించారు. కానీ, ఎక్కువ మంది రావటం ద్వారా ఆపరేషన్ చేసిన సమయంలో కేసీఆర్ కు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచించారు. దీంతో, ఇప్పుడు కేసీఆర్ ను పరామర్శించేందుకు సీఎం జగన్ హైదరాబాద్ వెళ్తున్నారు.

కేసీఆర్ ఇంటికి వెళ్తున్న జగన్ లంచ్ మీటింగ్ కు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఎన్నికల్లో ఓడిన తరువాత తొలి సారి జగన్ కలవనున్నారు. ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత తెలంగాణ ప్రభుత్వం తో సత్సంబంధాలు కొనసాగించారు. రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఇక, ఇప్పటి వరకు తెలంగాణలో కేసీఆర్ పైన పోరాటం చేసిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ నేతగా ఏపీలో యాక్టివ్ కావాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే జగన్ హైదరాబాద్ వెళ్లున్నారు. కేసీఆర్ ను పరామర్శించటం కోసం జగన్ వెళ్తున్నారని..ఇది మర్యాద పూర్వక సమావేశంగా పార్టీ నేతలు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయం..ఎన్నికల వేళ మరోసారి సీఎం జగన్ - కేసీఆర్ భేటీ ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications